కేసీఆర్‌తో జగన్ చేతులు కలుపకుండా కేంద్రం జాగ్రత్తపడుతోందా?

January 25, 2020


img

ఏపీ, తెలంగాణ సిఎం జగన్, కేసీఆర్‌ ఇద్దరూ స్నేహంగా ఉంటూ పరస్పరం సహకరించుకొంటున్నారు. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వైసీపీ మద్దతు తెలుపగా, టిఆర్ఎస్‌ వ్యతిరేకించింది. అయినా అది వారి స్నేహానికి అడ్డుకాలేదు. అయితే వైసీపీ కేవలం తన రాజకీయ కారణాలు, అవసరాల కోసమే సీఏఏకు మద్దతు తెలిపింది తప్ప దానిపై వైసీపీకి ఆసక్తిలేదనే వాదన వినబడుతోంది. కనుక సీఏఏను వ్యతిరేకిస్తూ పోరాటం పేరుతో ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు సిద్దపడితే జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరవచ్చు. అందుకు జగన్ అంగీకరించినా ఆశ్చర్యం లేదు.  

ఇప్పటివరకు బిజెపికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనబడేది. కానీ కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుండటంతో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. కనుక ప్రధాని నరేంద్రమోడీని శత్రువుగా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి, తటస్థంగా వ్యవహరిస్తున్న ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, కర్ణాటకలో బిజెపి వలన అధికారం కోల్పోయిన జెడీఎస్ పార్టీ అధినేతలు దేవగౌడలు వంటివారందరినీ ఫెడరల్ ఫ్రంట్‌ ద్వారా ఏకం చేసేందుకు సిఎం కేసీఆర్‌ ప్రయత్నించవచ్చు. 

ఇది ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలకు తెలియదనుకోలేము. కనుక జగన్‌ కేసీఆర్‌తో చేతులు కలపకమునుపే 23 ఎంపీలున్న వైసీపీని ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని వారు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన సమస్యల నుంచి బయటపడేందుకు అది అవకాశం కల్పిస్తుంది కనుక ఒకవేళ ఎన్డీయేలో చేరాలని ప్రధాని మోడీ కోరినట్లయితే జగన్ వెంటనే అంగీకరించవచ్చు. ఒకవేళ వైసీపీ ఎన్డీయేలో చేరితే జగన్ కేసీఆర్‌తో చేతులు కలపలేరని వేరే చెప్పక్కరలేదు.   

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకెతో సహా మరికొన్ని ప్రాంతీయపార్టీలను, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలను ఎన్డీయేలో చేర్చుకొనేందుకు బిజెపి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఫెడరల్ ఫ్రంట్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తట్టుకొని మళ్ళీ అధికారం నిలబెట్టుకోవచ్చునని బిజెపి అధిష్టానం భావిస్తోంది.


Related Post