కాంగ్రెస్‌కు అది అలవాటే.. కానీ పరిష్కారం అది కాదు కదా?

February 13, 2020


img

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు.   ఇప్పుడు డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడమే సమస్యకు పరిష్కారం అన్నట్లుంది కాంగ్రెస్‌ వ్యవహారం. కానీ రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని అర్ధమవుతోంది. కానీ పార్టీ అధిష్టానం కొత్తగా ఆలోచించలేకపోతోంది. నాయకత్వలోపమే అందుకు ప్రధానకారణంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ ఆరోగ్యకారణాల చేత పార్టీని నడిపించలేకపోవడం, నాయకత్వ లక్షణాలు లోపించడం వలన ఆత్మన్యూనతతో బాధపడుతున్న రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు వెనకాడుతుండటం, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ప్రియాంకా వాద్రా వెనకాడుతుండటం, సోనియా, రాహుల్‌ గాంధీలు తప్ప పార్టీలో వేరెవరూ పార్టీ పగ్గాలు చేపట్టలేని నిస్సహాయత వంటివి కాంగ్రెస్‌ పార్టీకి శాపాలుగా మారాయి. 

పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, అదే సమయంలో బిజెపి మరింత శక్తివంతంగా ఎదుగుతుండటం, వివిద రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలకే ప్రజలు పట్టంకడుతుండటం వంటివి కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి. 

డిల్లీ ఫలితాలపై మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఆమాద్మీ గెలుపును ఆస్వాదిస్తునట్లు ట్వీట్ చేయడంపై తీవ్రంగా స్పందించిన సీనియర్ కాంగ్రెస్‌ మహిళానేత శర్మిష్టా ముఖర్జీ “అయితే కాంగ్రెస్‌ దుకాణాలు బంద్‌ చేసుకొందామా?” అని అడగడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.  

ఎన్నికలలో పార్టీ ఓడిపోగానే పదవులకు రాజీనామాలు చేయడం పరిష్కారం కాదు.. పరిస్థితులకు ఎదురోడ్డి నిలబడి పోరాడితే విజయం సాధించవచ్చునని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలు నిరూపించి చూపారు. కనుక అటువంటి పోరాటపటిమ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ ముందుకు సాగగల బలమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వెతికి పట్టుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. వాటిలో కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు కావచ్చునని తెలుస్తోంది. కానీ మళ్ళీ రాహుల్‌ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలనుకొంటే శర్మిష్టా ముఖర్జీ చెప్పినట్లు దేశంలో కాంగ్రెస్‌ దుకాణాలన్నీ బంద్‌ చేసుకోక తప్పదేమో?


Related Post