వనస్థలిపురంలో దంపతుల ఆత్మహత్య

February 13, 2020


img

హైదరాబాద్‌ వనస్థలిపురంలో బీఎన్‌ రెడ్డి నగర్‌లో బుదవారం విషాదకర ఘటన జరిగింది, రంగారెడ్డి జిల్లా మల్‌రెడ్డి రంగారెడ్డి కేశంపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి(35), నిఖిత(32) దంపతులు ఆర్ధిక సమస్యలు భరించలేక నిన్న మధ్యాహ్నం తమ అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.

 “మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. బ్రతకడం చాలా కష్టంగా మారినందునే చనిపోతున్నాము. మా బాబును జాగ్రత్తగా చూసుకోండి..”అని సూసైడ్ నోట్ వ్రాసిపెట్టారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. రెండేళ్ళు వయసున్న వారి బాబు యశ్వంత్ రెడ్డిని మహిళా పోలీసులు సంరక్షణలో ఉంచి వారి బందువులకు సమాచారం అందించారు. 

పోలీసులు తెలిపిన దాని ప్రకారం, వెంకట్ రెడ్డి దంపతులు పెళ్ళైన తరువాత హైదరాబాద్‌ వచ్చి వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అతను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో ఇద్దరూ తీవ్ర ఆర్ధికసమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ వాటి నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. అయితే తాము చనిపోతే ఇంకా తల్లి ఒడి వీడని తమ చిన్నారి పరిస్థితి ఏమిటని ఆలోచించకపోవడం బాధాకరం. 

వారు తమ సమస్యల నుంచి బయటపడాలనుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇంకా పసిప్రాయంవీడని తమ బాబుని అనాధను చేసి అతని జీవితం, భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మార్చేశారు కదా? తల్లితండ్రులే తమ బిడ్డ గురించి ఆలోచించకుండా “బాబును జాగ్రత్తగా చూసుకోండి..” అంటూ వ్రాసి ఆత్మహత్య చేసుకొంటే, కుటుంబ సభ్యులు, బందువులు మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? వారికి ఆ అవసరం ఏమిటి? అని వారు ఒక్క నిమిషం ఆలోచించించి ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేవారు కారనే చెప్పొచ్చు. 

అయినా ఇంతకంటే దారుణమైన పరిస్థితులలో జీవిస్తున్నవారు,  అంగవైకల్యంతో లేదా తీవ్ర అనారోగ్యంతో బాధలు పడుతున్నవారు కూడా ఏదోవిధంగా జీవిస్తున్నప్పుడు వయసులో ఉన్న ఈ ఇద్దరు దంపతులు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవడం తొందరపాటే అని చెప్పక తప్పదు.


Related Post