ఎన్నికలుంటేనే రైతుబంధు: రేవంత్‌ రెడ్డి

February 12, 2020


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో జిల్లా కలక్టర్లతో సుదీర్గ సమావేశం నిర్వహించి, రెవెన్యూశాఖలో మార్పులు, గ్రామాభివృద్ధి గురించి చర్చించారు. దానిపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ సిఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో... సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో కలక్టర్లతో సుదీర్గంగా సమావేశమైనప్పుడు కనీసం 5 నిమిషాలు రైతుల సమస్యల గురించి చర్చించలేదు. ఎందుకంటే వాటి గురించి చర్చ మొదలుపెడితే రైతుబంధు పధకం, పంటరుణాల మాఫీ, మద్దతు ధరల గురించి కూడా చర్చించాల్సి వస్తుంది. రైతుబంధు పధకం ఎన్నికల పధకంగా మీరు భావిస్తున్నారు కనుకనే ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. రైతు సమన్వయ సమితి టిఆర్ఎస్‌ నేతలకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది తప్ప దాని వలన రైతులకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో తాజా రికార్డుల ప్రకారం దేశంలో అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. గత ఆరేళ్ళలో రాష్ట్రంలో 5,912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదిక చెపుతోంది. అంటే రైతుల విషయంలో సిఎం కేసీఆర్‌ చెపుతున్నవన్నీ అబద్దాలే అని స్పష్టం అవుతోంది. కనుక తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు రైతులందరూ ఏకం కావాలి,” అని లేఖలో వ్రాశారు. 

రైతుబంధు పధకం గురించి గొప్పలు చెప్పుకొనే టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే లేదు. అలాగే పంట రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం వంటి  హామీల గురించి ప్రస్తావించడానికి టిఆర్ఎస్‌ నేతలు ఇష్టపడటం లేదిప్పుడు. కనుక రేవంత్‌ రెడ్డి చెపుతున్నట్లు ఎన్నికలలో గెలిచేందుకే హామీలను ప్రకటించినట్లు భావించాలేమో? 


Related Post