బెడిసికొట్టిన చిదంబరం ట్వీట్

February 12, 2020


img

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమి, ఆమ్ ఆద్మీ విజయంపై స్పందిస్తూ మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం చేసిన ఒక ట్వీట్ మెసేజు బెడిసి కొట్టింది. దానిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. పార్టీ ఓటమి గురించి విశ్లేషించుకొని లోపాలను సరిదిద్దుకోవలసిన తరుణంలో బిజెపి ఓటమిని, ఆమ్ ఆద్మీ విజయాన్ని మెచ్చుకొంటూ పి చిదంబరం ట్వీట్ చేశారు.

“ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. గొప్పలు చెప్పుకొనే దగాకోరు పార్టీ (బిజెపి) ఓడిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చి డిల్లీలో స్థిరపడిన ప్రజలు..విభజన రాజకీయాలు చేసే బిజెపిని చిత్తుగా ఓడించారు. రానున్న రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన డిల్లీ ప్రజలకు నా సెల్యూట్,” అని ట్వీట్ చేశారు. 

 చిదంబరం చేసిన ఈ ట్వీట్‌పై మాజీ రాష్ట్రపతి కుమార్తె, సీనియర్ కాంగ్రెస్‌ నేత శర్మిష్టా ముఖర్జీ చాలా తీవ్రంగా స్పందించారు. “సార్..నేను ఒక విషయం తెలుసుకోవాలనుకొంటున్నాను. బిజెపిని ఓడించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయపార్టీలకు అప్పగించిందా? ఒకవేళ అదే నిజమానుకొంటే ఇకపై పిసిసి దుకాణాలు మూసుకొందామా?   ఎన్నికలలో మన పార్టీ ఓడిపోతే వేరే పార్టీ విజయానికి మనం పండగ జరుపుకోవడం ఏమిటి?” అని ఘాటుగా ప్రశ్నించారు. 

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ చేతిలో బిజెపి ఓడిపోయిన మాట వాస్తవం. అయితే గత ఎన్నికలలో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకొన్న బిజెపి ఈసారి 8 సీట్లు గెలుచుకోగలిగింది. అంటే మెల్లగా బలం పుంజుకొంటోందన్న మాట.  కానీ 15 ఏళ్ల పాటు ఏకధాటిగా డిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో, మళ్ళీ ఈసారి ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనుక బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ నష్టపోయిందని అర్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినందుకు చిదంబరం బాధపడ్డారో లేదో తెలియదు కానీ బిజెపి కూడా ఓడిపోయినందుకు ఆయన సంతోషించడం చూస్తే ‘నాకు ఒక కన్ను పోయినందుకు బాధపడటం లేదు...ఎదుటవాడికి రెండు కళ్ళూ పోయినందుకు సంతోషిస్తున్నాను’ అన్నట్లుంది. 


Related Post