గ్రామాభివృద్ధికే ప్రాధాన్యత: కేసీఆర్‌

February 12, 2020


img

ప్రగతి భవన్‌లో మంగళవారం కలక్టర్లతో సిఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఏడు దశాబ్ధాలుగా తెలంగాణలో గ్రామాలు నిర్లక్ష్యానికి వివక్షకు గురయ్యాయి. ఆ కారణంగా రాష్ట్రంలో గ్రామాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వాటి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరంగా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేసి ప్రతీ జిల్లాకు ఇద్దరు అదనపు కలక్టర్లను నియమించాము. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థల పర్యవేక్షణకే కేటాయించాము. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ.78 కోట్లు, రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి రూ.70 కోట్లు చొప్పున కేటాయిస్తాము. ప్రతీ జిల్లాలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవసరమైన సిబ్బందిని నియమించి, నిధులు అందుబాటులో ఉంచుతాము కనుక ఇకపై ప్రతీ గ్రామం, పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం, మౌలికవసతుల కల్పనపై జిల్లా కలక్టర్లు, అదనపు కలక్టర్లు దృష్టి పెట్టాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దాలి.

నేటి నుంచి 25 రోజులలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలి.  గ్రామాలలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక బృందం పర్యటిస్తుంటుంది. నేను కూడా హటాత్తుగా ఏదో ఓ గ్రామంలో పర్యటించి జరిగిన పనులను పరిశీలిస్తాను. ఈవిషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. అలాగే మంచి ఫలితాలు సాధించి చూపిన గ్రామాలు, పట్టణాలకు ప్రోత్సాహకాలు ఉంటాయి,” అని దిశానిర్దేశం చేశారు.


Related Post