కేజ్రీవాల్ మళ్ళీ ఊడ్చేశారు...

February 11, 2020


img

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 సీట్లలో 62 సీట్లు గెలుచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. మిగిలిన 8 సీట్లను బిజెపి గెలుచుకోగా కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దేశంలో తమకు ఎదురేలేదని చెప్పుకొంటున్న బిజెపికి దేశరాజధాని డిల్లీలోనే ఓడించి అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి తన సత్తా చాటుకున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ ప్రభావం,అమిత్ షా చాణక్యం రెండూ ఈ ఎన్నికలలో పనిచేయలేదని తేలిపోయింది. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళపాటు డిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 

ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో ఆమ్ ఆద్మీ పార్టీ 54-58 సీట్లు గెలుచుకోవచ్చునని జోస్యం చెప్పగా వాటి అంచనాలకు మించి 62 సీట్లు గెలుచుకొంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే 5 సీట్లు బిజెపికి కోల్పోయింది. కానీ తిరుగులేని మెజార్టీతో అరవింద్ కేజ్రీవాల్‌ ముచ్చటగా3వ సారి డిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. 

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలను అరవింద్ కేజ్రీవాల్‌ ఒక్కరే ఒంటి చేత్తో ఓడించడం విశేషమే. పార్టీ ఎన్నికల గుర్తు చీపురుతో కాంగ్రెస్‌, బిజెపిలను అరవింద్ కేజ్రీవాల్‌ ఊడ్చి పక్కన పడేశారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడం గొప్ప విషయమే. డిల్లీలోని పేదలకు, మధ్యతరగతి ప్రజల కోసం అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాలు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీ వంటివి ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి దోహదపడ్డాయని కాంగ్రెస్‌, బిజెపి నేతలే చెపుతున్నారు.


Related Post