అంతవరకు పార్టీకి దూరంగా ఉంటా: రఘునందన్ రావు

February 11, 2020


img

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావుపై రాధ రమణి అనే ఒక మహిళ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. విడాకుల కేసులో న్యాయవాది అయిన రఘునందన్ రావు కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆయన కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి, తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలను రఘునందన్ రావు ఖండించారు. 

అయితే తనపై పడిన ఈ అపవాదు నుంచి బయటపడేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్న ఆయన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు లేఖ ద్వారా ఆవిషయం తెలియజేశారు. చిరకాలంగా బిజెపి సిద్దాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న తాను నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కోవలసివస్తోందని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేనివారెవరో ఆమె ద్వారా తనపై ఈ కుట్ర చేసినట్లు భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. నగరంలోనే మరో రెండు పోలీస్‌స్టేషన్లలో కూడా ఆమె వేరే వ్యక్తులపై ఇటువంటి అభియోగాలే చేస్తూ కేసులు నమోదు చేశారని, కోర్టులో న్యాయవాదులను, పోలీసులను బెదిరిస్తున్నట్లు మాట్లాడారని రఘునందన్ రావు లేఖలో పేర్కొన్నారు. వాటిని బట్టి ఆమె ఎటువంటిదో అర్ధం అవుతోందని, తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజంకావని స్పష్టం అవుతోందని లేఖలో పేర్కొన్నారు. న్యాయస్థానంలో తాను నిర్ధోషినని తప్పక నిరూపించుకొంటానని అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకొంటునట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసు వలన పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు రఘునందన్ రావు లేఖలో పేర్కొన్నారు.




Related Post