చెన్నమనేని సమస్యకు పరిష్కారం ఇంకా ఎప్పుడో?

February 10, 2020


img

వేములవాడ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు కేసుపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేంద్రహోంశాఖ తరపు వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ‘ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడే చెన్నమనేని జర్మనీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్ళి వచ్చారని’ వాదించారు. కనుక నేటికీ ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని రుజువు అవుతోందని వాదించారు.  

కానీ చెన్నమనేని తరపు వాదించిన న్యాయవాది ఆయన జర్మనీ పౌరసత్వాన్ని చాలా కాలం క్రితమే వదులుకొన్నారని కోర్టుకు తెలిపారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ, “చెన్నమనేని భారత్‌ పౌరసత్వం కలిగి ఉన్నప్పుడు జర్మనీ పాస్‌పోర్టును ఎందుకు వినియోగించుకొంటున్నారని ప్రశ్నించింది. జర్మనీ ప్రభుత్వం చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసిందా లేదా?జర్మనీ పౌరసత్వాన్ని రద్దు అయినట్లు మీవద్ద అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా...లేవా?” అని ప్రశ్నించారు. ఈనెల 24లోగా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం రద్దు అయినట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి, అంతవరకు ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రహోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. 

చెన్నమనేని రమేష్ అచ్చమైన భారతీయుడే..అచ్చమైన తెలంగాణవాసే. కానీ గతంలో జర్మనీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నప్పుడు ఆ దేశం పౌరసత్వం తీసుకున్నారు. భారత్‌ తిరిగి వచ్చేసిన తరువాత తన జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా తప్పుడు సమాచారంతో మోసపూరితంగా భారత్‌ పౌరసత్వం కూడా పొందారనేది కేంద్రహోంశాఖ వాదన. కనుక చెన్నమనేని భారత్‌ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు అని పేర్కొంటూ 2017,డిసెంబర్ 13న ఆయన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి చెన్నమనేని తన పౌరసత్వం కోసం న్యాయపోరాటం చేస్తునే ఉన్నారు. 

అయితే నేటికీ ఆయన జర్మనీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్ళి వస్తుండటం నిజమైతే హైకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలున్నాయి. అదీగాక ఆయన తప్పుడు సమాచారంతో మోసపూరితంగా భారత్‌ పౌరసత్వం పొందారనే కేంద్ర హోంశాఖ వాదనలకు ఆయన సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవలసి ఉంది. లేకుంటే చెన్నమనేనికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.


Related Post