నల్గొండలో బిజెపికి షాక్

February 10, 2020


img

నల్గొండలో బిజెపికి టిఆర్ఎస్‌ షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో 48 వార్డులలో కాంగ్రెస్‌-20, టిఆర్ఎస్‌-20, బిజెపి-6, మజ్లీస్-1, ఇండిపెండెంట్-1 స్థానాలు గెలుచుకోవడంతో మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య పోటీ ఏర్పడింది. అప్పుడు తమకు మద్దతు ఇచ్చినట్లయితే బిజెపికి వైస్ ఛైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది. బిజెపి కూడా అందుకు సిద్దపడింది. కానీ టిఆర్ఎస్‌ కూడా అదే ఆఫర్ ఇవ్వడంతో బిజెపి కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చింది. అయితే టిఆర్ఎస్‌ కూడా బిజెపికి హ్యాండివ్వడం విశేషం.

ముందు వైస్ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా అడ్డుకొన్న టిఆర్ఎస్‌, మజ్లీస్, ఇండిపెండెంట్, ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో మునిసిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకొంది. తరువాత టిఆర్ఎస్‌ కౌన్సిలర్ అబ్బగొని రమేశ్ గౌడ్‌ను వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకొని బిజెపికి షాక్ ఇచ్చింది.

మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా బిజెపి తటస్థంగా వ్యవహరించడం వలన కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ నష్టపోయాయి. అయితే కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లతో అవగాహన ఉందని బిజెపి బయటకు చెప్పలేదు. అలాగే బిజెపితో అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ బయటకు చెప్పుకోలేదు. కనుక కాంగ్రెస్‌, బిజెపిలు పరస్పరం బహిరంగంగా నిందించుకోలేవు. అలాగని టిఆర్ఎస్‌ తమను మోసం చేసిందని చెప్పుకోలేవు కనుక తేలు కుట్టిన దొంగలా బాధను భరించక తప్పదు.


Related Post