జీహెచ్‌ఎంసీ అత్యుత్సాహం దేనికో?

February 10, 2020


img

పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ తీర్మానం ఆమోదించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన శనివారం జీహెచ్‌ఎంసీ సర్వసభ్యసమావేశం జరిగింది. ఆ సమావేశంలో డెప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా దానిపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దీనిపై ఇప్పటికే సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ త్వరలో శాసనసభలో కూడా తీర్మానం చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. కనుక మనం కూడా ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా నడుచుకోవలసి ఉంటుంది కనుక సీఏఏను వ్యతిరేకిస్తూ డెప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.

జీహెచ్‌ఎంసీ సమావేశంలో ఉదయం బడ్జెట్‌పై చర్చించిన తరువాత మధ్యాహ్నం సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. 

అయితే ఈవిషయంలో జీహెచ్‌ఎంసీ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. నగర పాలనా వ్యవహారాలను చూసుకోవలసిన జీహెచ్‌ఎంసీ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం తొందరపాటే అని చెప్పాలి. ఎందుకంటే, సీఏఏపై సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ దానిపై శాసనసభలో ఇంకా తీర్మానం చేయనేలేదు. శాసనసభ కంటే ముందుగా జీహెచ్‌ఎంసీ తీర్మానం చేయవలసిన అవసరం ఏమిటి?


Related Post