త్వరలో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు?

January 25, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో అధికార టిఆర్ఎస్‌ ఘనవిజయం సాదించడంతో సిఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

“కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న పనికిమాలిన విధానాలవలన దేశఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మేధావులు, ఆర్ధికవేత్తలు, అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా కేంద్రప్రభుత్వం సమస్యను గుర్తించకుండా మొండిగా పనికిమాలిన అంశాలను తలకెత్తుకొని ముందుకు వెళుతూ దేశాన్ని..ప్రజలను కూడా సమస్యలలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశఆర్ధిక పరిస్థితులు నానాటికీ దిగజారుతుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా అయోధ్యలో ఆకాశమంత ఎత్తు ఉండే రామమందిరం నిర్మిస్తాము... సీఏఏ చట్టాన్ని అమలుచేస్తామంటూ అనవసరమైన అంశాల గురించి మాట్లాడుతోంది. ఇటువంటి పనికిమాలిన అంశాలతో ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవాలనుకొని బోర్లాపడుతున్నా కేంద్రం వైఖరిలో మార్పు  రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకుండా...దేశాభివృద్ధి గురించి ఆలోచించకుండా ఇటువంటి పనికిమాలిన చట్టాలను తెచ్చి ప్రజల నెత్తిన రుద్దాల్సిన అవసరం ఏమిటి? మనకివన్నీ ఇప్పుడు అవసరమా? అని కేంద్రాన్ని అడుగుతున్నాను.

మనది సెక్యులర్ దేశం. అన్ని కులమతాలవారు కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. అటువంటి వ్యవస్థను మనమే పాడుచేసుకోవడం అవివేకం కదా?సీఏఏ వలన ప్రపంచదేశాలలో మన దేశప్రతిష్టకు భంగం కలుగుతోంది కూడా. అందుకే సీఏఏను వ్యతిరేకించాలని నేనే మా ఎంపీలకు చెప్పాను. ఆ నిర్ణయానికి ఎప్పటికీ మేము కట్టుబడి ఉంటాము. సీఏఏను వ్యతిరేకిస్తే ఓట్లు పోతాయేమో.. కేంద్రప్రభుత్వానికి ఆగ్రహం కలుగుతుందేమోనని మేము భయపడము. ఎందుకంటే.. మాకు ఈ పనికిమాలిన రాజకీయాలకంటే దేశప్రయోజనాలే ముఖ్యం. కనుక నేనే స్వయంగా పూనుకొని దేశంలో ప్రాంతీయపార్టీలనన్నిటినీ కలుపుకొని సీఏఏకు వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమిస్తాను. నెలరోజులలోపే దేశంలో అన్ని పార్టీల నేతలతో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి హైదరాబాద్‌లోనే 10 లక్షల మందితో బారీ బహిరంగసభ ఏర్పాటు చేసి కేంద్రప్రభుత్వానికి ప్రజాభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తాము. ఎందుకంటే, దేశప్రజలు ఏమనుకొంటున్నారో కేంద్రప్రభుత్వం గమనించనప్పుడు దానికి తెలియజేవలసిన బాధ్యత మాపై ఉంది. సీఏఏకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భావస్వారూప్యత ఉన్న పార్టీలన్నిటినీ (కాంగ్రెస్‌ పార్టీ?) కలుపుకొని పోతాము. ఒక గొప్ప లక్ష్యంతో ఉద్యమిస్తున్నప్పుడు అతను ఎల్లయ్యా...పుల్లయ్యా…లేక మల్లయ్యా అని చూడకూడదు. దేశంలో జాతీయపార్టీలు రెండూ అన్ని విధాలా ఫెయిల్ అయ్యాయి. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంటే!” అని అన్నారు.


Related Post