కొడంగల్ కూడా కాంగ్రెస్‌ చేజారిపోయింది

January 25, 2020


img

ఏ నాయకుడైనా తన జిల్లా..తన నియోజకవర్గమే పునాదిగా ఎదుగుతాడు. ఒకవేళ ఆ పునాదులే దెబ్బ తింటే దానిమీద నిర్మించుకొన్న ఆ నాయకుడి రాజకీయజీవితం కూడా బీటలువారే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి వికారాబాద్‌లో కొడంగల్ నియోజకవర్గం అటువంటిదే. అక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన 2018 ముందస్తు ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన మల్కాజగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అది వేరే సంగతి.

కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కొడంగల్ నియోజకవర్గంపై క్రమంగా పట్టుకోల్పోయినట్లు మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఆ నియోజకవర్గంలోని 12 వార్డులలో టిఆర్ఎస్‌ 8 సొంతం చేసుకొని పట్టుసాధించింది. కొడంగల్‌పై తన పట్టు నిలుపుకొనేందుకు రేవంత్‌ రెడ్డి చాలా బలంగా కృషిచేసినప్పటికీ ప్రజలు టిఆర్ఎస్‌వైపే మొగ్గుచూపారు. దాంతో కొడంగల్ నియోజకవర్గంపై రేవంత్‌ రెడ్డి ప్రభావం తగ్గి టిఆర్ఎస్‌ ప్రభావం పెరిగిందని స్పష్టమైంది.

ప్రస్తుతం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నందున ఈ ఓటమితో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటే మాత్రం చాలా కష్టమే.


Related Post