మూడు రాజధానులు...తెలంగాణకు మేలు

January 22, 2020


img

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటుచేయాలనే జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరంగా మారనుంది. గత ప్రభుత్వం అమరావతిని అత్యాధునికమైన పద్దతిలో అన్ని ఆధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయస్థాయిలో నిర్మించాలనుకొంది. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే, దేశవిదేశాలలోని పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయంగా పేరొందిన ఐ‌టి కంపెనీలు అమరావతికి తరలివచ్చేవి. అప్పుడు అమరావతి హైదరాబాద్‌కు పోటీగా తయారయ్యేది.కానీ జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఏపీకి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితి ప్రజలకు ఏర్పడింది. ఏ రాష్ట్రానికైనా...దేశానికైనా అన్నివిధాల అభివృద్ధి చెందిన రాజధాని నగరమే ప్రతీకగా నిలుస్తుంది. అదే అందరినీ ఆకర్షిస్తుంది. హైదరాబాద్‌ నగరమే అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. హైదరాబాద్‌కు ధీటుగా ఏపీకి పూర్తిస్థాయి రాజధానే లేకపోవడంతో  హైదరాబాద్‌కు అసలు పోటీయే లేదిప్పుడు.       

ఏ రాష్ట్రంలోనైనా ఒక నిర్ధిష్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సులువే కానీ ఒకేసారి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం చాలా కష్టం. అందునా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇంకా కష్టం. పైగా ఉద్యోగులు ఒక చోట, పరిపాలన మరొక చోట, హైకోర్టు వేరే చోట ఉండటం, మళ్ళీ ఆ మూడు వ్యవస్థలకు చెందిన విభాగాలు రెండు మూడు ప్రాంతాలలో ఏర్పాటుచేయడం వలన గందరగోళ పరిస్థితులు, పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. 

అప్పుడు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంస్థలు అనుమతుల కోసం లేదా సమస్యలు తలెత్తినప్పుడు ఈ మూడు రాజధానుల మద్య తిరుగవలసిరావచ్చు. ఆవిధంగా తిరగాలని ఏ వ్యాపారి, పారిశ్రామికవేత్త కోరుకోరు కనుక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడవచ్చు. 

ఇక మరో అవాంఛనీయమైన పరిణామం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన ప్రజాప్రభుత్వం ఉన్నప్పటికీ, ఈ రాజధాని అంశం కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత లేదా గందరగోళం నెలకొని ఉంది. రాజకీయ అనిశ్చిత ఉన్న ఏ రాష్ట్రం... ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. పైగా ప్రస్తుతం ఏపీలో ప్రతీకార రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. 

ఈ రాజకీయ అనిశ్చితి కంటే ఇంకా ప్రమాదకరమైన మరో భయం కూడా అందరిలో ఆందోళన కలిగిస్తోంది. టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేయాలనుకొంటే, వైసీపీ ప్రభుత్వం దానిని మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాలకు తరలిస్తోందిప్పుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ మళ్ళీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినట్లయితే, రాజధానిని మళ్ళీ అమరావతికి మార్చకుండా ఉంటుందా? అనే ఓ ప్రశ్న అందరిలో మదిలో మెదులుతోంది. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నమ్ముకొని విశాఖ, అమరావతి లేదా కర్నూలులో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా తరువాత వాటి భవిష్యత్‌ ఏవిధంగా ఉంటుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అవాంఛనీయ పరిణామాలు సందేహాల నేపధ్యంలో రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడకపోవచ్చు. 

అప్పుడు పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ఐ‌టి కంపెనీలు సహజంగానే పొరుగునే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం..రాజధాని హైదరాబాద్‌ నగరానికి మొగ్గు చూపవచ్చు. కనుక ఏపీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాల వలన ఏపీ లాభపడుతుందో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా లాభపడుతుందని చెప్పవచ్చు.


Related Post