బండి సంజయ్ అలకపాన్పు

January 22, 2020


img

కరీంనగర్‌ నగర్ పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన బిజెపి ఎంపీ బండి సంజయ్ అలకపాన్పు ఎక్కారు. రెండు రోజుల క్రితం బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై కొందరు వ్యక్తులు రాళ్ళు విసిరారు. దాంతో కరీంనగర్‌ పోలీసులు ఆయనకు ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేశారు. ఇది జరిగిన మర్నాడే కరీంనగర్‌ నగర్ పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌ రెడ్డి అటువంటిదేమీ జరుగలేదని అన్నారు. దాంతో ఆగ్రహించిన బండి సంజయ్, కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాపై రాళ్ళ దాడి జరగనప్పుడు పోలీసులు నాకు అదనపు భద్రత ఎందుకు కల్పించారు?సిపి వ్యాఖ్యలకు నిరసనగా నా వ్యక్తిగత భద్రతకు కేటాయించిన పోలీసులను తిప్పి పంపిస్తున్నాను. ఒక ఎంపీ పట్ల పోలీస్ కమీషనర్ ఈవిధంగా వ్యవహరించడం చాలా శోచనీయం,” అని అన్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రత విషయంలో పోలీసులు ప్రోటోకాల్ పాటించకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుందని ఆర్టీసీ సమ్మె సమయంలో నిరూపితమైంది. కరీంనగర్‌ డిపోకు చెందిన డ్రైవర్ ఎన్‌ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్‌ పట్ల దురుసుగా వ్యవహరించినందుకు ఆయన లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేయడం, స్పీకర్ కార్యాలయం డీజీపీని సంజాయిషీ కోరడం జరిగాయి. 

ఇప్పుడు ఎంపీ బండి సంజయ్‌పై రాళ్ళదాడి జరిగింది. దాడి జరిగిందని పోలీసులే అంగీకరించి ఆయనకు అదనపు భద్రత కల్పించినప్పుడు, దాడి జరుగలేదని కమీషనర్ చెప్పడం కొత్త సమస్యను ఆహ్వానించడమే అవుతుంది. ఎంపీ బండి సంజయ్‌ వ్యక్తిగత భద్రతాసిబ్బందిని వెనక్కు తిప్పి పంపేయడమే తొలి సమస్య అని భావించవచ్చు. 


Related Post