హైదరాబాద్‌కు త్వరలో మరో ప్రత్యేక ఆకర్షణ!

January 22, 2020


img

హైదరాబాద్‌ నగరంకున్న పలు ప్రత్యేకతల కారణంగా దేశవిదేశాల పర్యాటకులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. త్వరలో దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయితే నగరానికి అదో ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. ఇదిగాక నగరంలో నానాటికీ పెరిగిపోతున్న పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా ‘మల్టీలెవెల్ ఇంటిగ్రేటడ్ స్మార్ట్ పార్కింగ్’ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అది కూడా నగరానికి ప్రత్యేకాకర్షణగా నిలువనుంది. 

జీహెచ్‌ఎంసీ కమీషనర్ డిఎస్ లోకేశ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దానిలో సిటీ చీఫ్‌ ప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి, అదనపు కమిషనర్లు జయరాజ్‌ కెనడి, జె.శంకరయ్య, ఎస్‌ఈబీ శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, ఈఈ మమత తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములలో ఈ అత్యాధునిక బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు నిలిపేందుకుగాను జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలలో ఇటువంటి అత్యాధునిక వ్యవస్థలు ఎప్పుడో ఏర్పాటయ్యాయి. అటువంటివి నగరంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే పార్కింగ్ సమస్య పరిష్కారం కావడంతో పాటు జీహెచ్‌ఎంసీకి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ భూములను లీజుకు ఇచ్చినవారికి కూడా ఆదాయం లభిస్తుంది. 

ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను సులువుగా తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో అమార్చుకోవచ్చు అవసరమైతే మళ్ళీ విడదీసి వేరే చోట బిగించుకొనే వెసులుబాటు కూడా ఉంది. కనుక ప్రైవేట్ భూయజమానులు కూడా వీటి కోసం తమ స్థలాలను లీజుకిచ్చేందుకు ముందుకురావచ్చునని జీహెచ్‌ఎంసీ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించి ఆమోదం లభించగానే నగరంలో కొన్ని ఎంపికచేసిన ప్రధాన చౌరస్తాలలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని సమావేశంలో నిర్ణయించారు. 


ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే...వాహనాల యజమానులు తమ వాహనాలను ఈ వ్యవస్థ ఆపరేటర్‌కు అప్పగించిన తరువాత దానిని లిఫ్ట్ వంటి ఓ ప్లాట్ ఫారం ద్వారా వివిద అంతస్తులలో ఏర్పాటు చేసిన వందలాది ర్యాక్స్ (అలమారాలు)లోకి పంపిస్తారు. వాహన యజమాని తిరిగి వచ్చినప్పుడు దానిలో నుంచి మళ్ళీ అదే విధంగా క్రిందకు దించి వాహనాన్ని అప్పగిస్తారు. దీనితో చాలా తక్కువ విస్తీర్ణంలో వందలాది వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ అత్యాధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటయితే అది నగరానికి ప్రత్యేకాకర్షణగా కూడా మారుతుంది.


Related Post