కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా: డి శ్రీనివాస్

January 21, 2020


img

టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ చాలారోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి చాలా తప్పు చేశాను. ఆనాడు దిగ్విజయ్ సింగ్‌ నా గురించి సోనియా గాంధీకి పిర్యాదులు చేస్తున్నప్పుడు, ఆమెను కలిసి వివరణ ఇచ్చుకొనేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆవేదన చెంది పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరాను. కానీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినందుకు నేటికీ చాలా బాధపడుతున్నాను. టిఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు మనస్ఫూర్తిగా కృషి చేశాను తప్ప ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. కానీ జిల్లా నేతలు నాపై సిఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సిఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చుకొనేందుకు ప్రయత్నించాను కానీ ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారు. ఒకవేళ నేను నిజంగానే పార్టీకి నష్టం కలిగిస్తున్నానని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లయితే మరి నాపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి నేను శాయశక్తులా కృషి చేశాను తప్ప నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. కానీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాలు చేస్తున్నాను,” అని అన్నారు.

డి శ్రీనివాస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగారు కానీ ఆయన చెప్పుకొన్నట్లుగా ఆవేశంతోనో...పదవులకు ఆశపడో టిఆర్ఎస్‌లో చేరారు. దానిలో కూడా ఆయనకు మంచి గౌరవమే దక్కింది. కానీ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఎదురైన చేదు అనుభవమే టిఆర్ఎస్‌లో ఎదురయిందంటే తప్పు తనలో ఉందా లేక పార్టీలలోనే ఉందో ఆలోచించుకోవలసిన అవసరముంది. అయినా ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో ఏ రంగంలోనైనా బలవంతంగా కొనసాగేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి ముగింపు ఇంకా అవమానకరంగానే ఉంటుంది తప్ప గొప్పగా ఉండదని నిరూపితమైంది. కనుక డి శ్రీనివాస్ సరైన నిర్ణయం తీసుకొంటే మంచిదేమో?


Related Post