మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నేత పోలీసులకు ఫిర్యాదు!

January 21, 2020


img

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం పిర్యాదు చేశారు. మునిసిపల్ ఎన్నికలలో ఆయన అభ్యర్ధులకు పార్టీ టికెట్లను అమ్ముకున్నారని కనుక దానిపై దర్యాప్తు జరిపి ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఎన్నికలలో టికెట్లు అమ్ముకొన్నందుకు సిఎం కేసీఆర్‌ ఆయనను తక్షణం మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయనకు డబ్బిచ్చి టికెట్లు కొనుగోలు చేయాలనుకొన్నవారిపై కూడా టిఆర్ఎస్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మునిసిపాలిటీలలో అవినీతిరహితంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌ మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకొన్నట్లు తెలిసినప్పటికీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ టికెట్లు అమ్మకాలు, ఎన్నికలలో గెలిచేందుకు ఓటర్లకు డబ్బు, మద్యం పంచిపెట్టడం టిఆర్ఎస్‌కు పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను టిఆర్ఎస్‌ పెట్టుబడిదారి వ్యవస్థగా మార్చేసిందని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనిని సుమోటోగా స్వీకరించి ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలలో పార్టీ టికెట్లు అమ్ముకోవడం ప్రస్తావన వస్తే మొట్టమొదట గుర్తుకువచ్చేది కాంగ్రెస్ పార్టీయే. 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి పార్టీ టికెట్లు అమ్ముకొన్నారని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడం, అందుకు వారిపై పార్టీ వేటువేయడం, మరికొందరు పార్టీ వీడి వెళ్లిపోవడం అందరికీ తెలుసు. 

సమర్దులను, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని కాదని ఎన్నికలలో పెట్టుబడి పెట్టేవారికి టికెట్లు కేటాయించే సంస్కృతి దాదాపు అన్ని పార్టీలలోను ఉంది. రాజకీయాలను వ్యాపారంగా భావించి పెట్టుబడి పెట్టేవారు తమకు నష్టం వస్తుందనుకొంటే వెంటనే పార్టీ మారిపోతారు. అందుకే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన పార్టీలు హటాత్తుగా కుప్పకూలిపోతుంటాయి. మన కళ్ళ ముందే అటువంటి పార్టీలున్నాయి. కనుక అటువంటి దుస్థితి రావద్దనుకొంటే ఇటువంటి అనైతిక విధానాలకు అన్నీ పార్టీలు దూరంగా ఉండటమే మంచిది.


Related Post