బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

January 20, 2020


img

బిజెపి జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జేపీ నడ్డా ఈరోజు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం డిల్లీలోని బిజెపి ప్రధానకార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలో పార్టీ సీనియర్ నేతలందరూ పాల్గొన్నారు. పార్టీలో నేతలెవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకపోవడంతో జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్ ప్రకటించారు. 

ఇప్పటివరకు బిజెపి జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అమిత్ షా కేంద్రహోంమంత్రిగా కూడా బాధ్యతలు చూసుకోవలసివస్తుండటంతో పార్టీ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. కనుక ఆరు నెలల క్రితమే ఆయనే స్వయంగా జేపీ నడ్డా పేరును అధ్యక్ష పదవికి సూచించారు. అయితే వరుసగా వివిద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుండటంతో ఇప్పటి వరకు అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్రమంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇప్పుడు బిజెపిలో అత్యున్నతమైన ఈ అధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రస్తుతం దేశంలో బిజెపికి తిరుగులేనప్పటికీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ మొదలైన అంశాలపై ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉంది. కనుక ఒకపక్క ఆ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే దేశంలో పార్టీని బలోపేతం చేయవలసి ఉంటుంది. అమిత్ షా నేతృత్వంలో ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి బలపడింది కానీ దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం నిలద్రొక్కుకోలేకపోతోంది. కనుక జేపీ నడ్డా బహుశః దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారిస్తారేమో? 


Related Post