మోడీ గెలిచారు..ఖాన్ దాదా

January 18, 2020


img

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయవేదికలపై ప్రస్తావిస్తూ భారత్‌ను ఏదోవిధంగా ఇబ్బందిపెట్టాలని పాక్‌ ప్రభుత్వం విఫలయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అంతర్జాతీయ సమాజం కశ్మీర్ అంశంపై అసలు స్పందించడమేలేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే పాశ్చాత్యదేశాలు కశ్మీర్ అంశంపై మౌనం వహిస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసనలకు సంబందించి వార్తలకు అత్యంత ప్రాధ్యాన్యం ఇస్తున్న మీడియా, కశ్మీరులో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను, భారత్‌లో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకొంటోందని కానీ అంతర్జాతీయ సమాజం ప్రేక్షకపాత్రకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజల కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. 

ఇమ్రాన్ ఖాన్‌ ఏ ఉద్దేశ్యంతో ఈ మాటలు అన్నప్పటికీ అవి భారత్‌ దౌత్యవిజయాన్ని అంగీకరించినట్లే భావించవచ్చు. ఇక పాకిస్థాన్‌లోని ముస్లిం ప్రజల కంటే భారత్‌లో మైనార్టీలుగా భావింపబడుతున్న ముస్లిం ప్రజలే సుఖంగా జీవిస్తున్నారు. మంచి విద్య, ఉద్యోగ, ఉపాది అవకాశాలు కలిగి ఉన్నారని చెప్పవచ్చు. కనుక భారత్‌లో ముస్లింల గురించి ఆయన ఆలోచించనవసరం లేదనే చెప్పాలి.   

ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్ కనుక పాశ్చాత్యదేశాలు తమ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కశ్మీర్ అంశంపై మౌనం వహిస్తున్నాయనే ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం కూడా సరైనదేనని చెప్పవచ్చు. కానీ భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న పాశ్చాత్యదేశాలు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడానికి ఇష్టపడటం లేదు? అని ఆలోచిస్తే ఇమ్రాన్ ఖాన్‌కు సమాధానాలు లభిస్తాయి. 

భారత్‌, పాక్‌లకు ఇంచుమించు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి భారత్‌ స్థిరంగా అభివృద్ధిపధంలో ముందుకు సాగుతుంటే, పాక్‌ ఉగ్రవాదబాటలో సాగుతూ చివరికి ఈ దుస్థితికి చేరుకొంది. కనుక ఇప్పటికైనా భారత్‌ను దెబ్బ తీయాలనే ఆలోచనలు మానుకొని, ఉగ్రవాదులను పెంచి పోషించడానికి చేస్తున్న ఖర్చుతో దేశాభివృద్ధి చేసుకొంటే పాక్‌ ఎవరినీ నిందించవలసిన అవసరం ఉండదు కదా?


Related Post