కేసీఆర్, జగన్ భేటీలో కొత్తగా ఏముంది?

January 13, 2020


img

ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సుదీర్గంగా సమావేశమయ్యారు. ముందుగా వారిరువురూ కలిసి భోజనం చేశారు. ఆ తరువాత రెండు రాష్ట్రాలకు సంబందించిన విభజన సమస్యలపై చర్చించారు. షెడ్యూల్ 9, 10లో సంస్థలకు సంబందించి చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించారు. వాటిలో తక్షణం పరిష్కరించుకోగలిగిన వాటిపై త్వరలోనే ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు భాటీ అయ్యి చర్చించుకోవాలని అక్కడికక్కడే ఇరువురూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెండు రాష్ట్రాలలో సాగునీటిసమస్యలున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ జిల్లాలలోని వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కృష్ణ జలాలతో పాటు గోదావరి జలాలను కూడా అందించాలని ఇరువురూ సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై మరింత లోతుగా చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురూ నిర్ణయించారు. 

ఇవన్నీ మీడియాకు తెలిసిన విషయాలే. వారి భేటీలో ఇవి మాత్రమే చర్చించుకొన్నట్లయితే ఇందులో కొత్తగా చెప్పుకోవలసినది ఏమీ లేదనే చెప్పాలి. కానీ వారిరువురూ ఏపీ రాజకీయాలపై లోతుగా చర్చించి ఉండవచ్చునని వేరే చెప్పనవసరం లేదు. ఏపీ రాజధానిని విశాఖకు తరలింపు ప్రతిపాదన, దానిపై అమరావతిలో జరుగుతున్న ఆందోళనల గురించి వారు ఏమి మాట్లాడుకున్నారు? సిఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏమి సలహాలు ఇచ్చారనే విషయం తెలియవలసి ఉంది. 

ఇక తెరాస సీఏఏకి వ్యతిరేకంగా, వైసీపీ అనుకూలంగా ఓటేసినందున, దానిపై వారిరువురూ ఏవిధంగా ముందుకు సాగాలనుకొంటున్నారో తెలియవలసి ఉంది. తెలంగాణలో.. ముఖ్యంగా హైదారాబాద్ లో ఆంధ్రావాళ్ళు ఎక్కువగా ఉన్నందున మునిసిపల్ ఎన్నికలలో తెరాసకు అనుకూలంగా వైసీపీ నేతలు ఎవరైనా ప్రచారం చేస్తారా లేదా అనే విషయంపై ఏమైనా చర్చ జరిగిందా లేదా అనేది త్వరలోనే తెలియవచ్చు.


Related Post