ఇప్పుడు చంద్రబాబు విరాళాలు సేకరణ ఎందుకో?

January 13, 2020


img

ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలనే జగన్‌ ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ్ళ అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన జోలి పట్టి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ జరుగుతున్న పోరాటాల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు టిడిపి తెలిపింది. 

గతంలో అమరావతి నిర్మాణం కోసం టిడిపి ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు సేకరించింది. ఆ తరువాత ‘అమరావతికి ఇటుకలు’ పేరు చెప్పి మళ్ళీ విరాళాలు సేకరించింది. కానీ 5 ఏళ్ళలో ప్రజలు ఆశించిన స్థాయిలో అమరావతి నిర్మాణపనులు చేపట్టలేదు. ఒకవేళ రాజధాని నగరానికి రూపురేఖలు తెచ్చి ఉంటే నేడు జగన్‌ ప్రభుత్వం రాజధాని మార్చాలనే ఆలోచన కూడా చేయగలిగేది కాదు కదా? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబునాయుడు పోరాడుతున్నారు. కానీ ఆ పోరాటంలో కూడా చిత్తశుద్ది నిజాయితీ కనబడటం లేదు. ఒకవేళ అమరావతిలోనే రాజధాని కొనసాగాలనేది టిడిపి వైఖరి అయితే ఏపీలో 13 జిల్లాల టిడిపి నేతలు రాజధాని తరలింపుపై తమ అధినేతతో కలిసి పోరాడాలి. కానీ టిడిపిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు తప్ప మిగిలిన జిల్లాల నేతలందరూ మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే, విశాఖకు రాజధాని, కర్నూలుకు హైకోర్టు వద్దని చెపితే ప్రజాగ్రహానికి గురవుతామనే భయం చేత. మరి అటువంటప్పుడు, చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటాలకు అర్ధం ఏముంది? దాని కోసం మళ్ళీ ప్రజల నుంచి విరాళాలు ఎందుకు సేకరిస్తున్నట్లు?

కనుక ఇది ఆయన రాజకీయ మనుగడ కోసం చేస్తున్న పోరాటమే అయితే ఆయన తన సొంత డబ్బో లేదా పార్టీ డబ్బో  తీసి ఖర్చు పెట్టుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఒకవేళ ఇది యావత్ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న పోరాటమనుకొంటే అన్ని జిల్లాలలో టిడిపి నేతలు ‘రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని’ ధైర్యంగా ప్రజల మద్యకు వచ్చి మాట్లాడాలి. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబునాయుడు రాజకీయ లాభనష్టాల లెక్కలు వేసుకొని రాజకీయాలు చేయడం వలన అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రాకు పూర్తి అనుకూలంగా మాట్లాడలేకపోయారు. తత్ఫలితంగా తెలంగాణలో ప్రజాభిమానం కోల్పోయి టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అదేవిధంగా వ్యవహరిస్తే ఏపీలో కూడా అలాగే జరుగవచ్చు. కనుక ముందుగా రాజధానిపై టిడిపి వైఖరి ఏమిటో నిర్ణయించుకొని అడుగు ముందుకు వేస్తే మంచిది.


Related Post