జగన్ పాలన బాగుందని నేను అనలేదు: కేటీఆర్‌

January 13, 2020


img

విశాఖకు అమరావతి తరలింపు, మూడు రాజధానులు ప్రతిపాదనలపై ప్రస్తుతం అమరావతిలో జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిపై తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే, హైదరాబాద్‌, వరంగల్, ఖమ్మంలో ఆంధ్రాకు చెందిన లక్షలాది మంది ప్రజలున్నారు. కనుక ఏపీ రాజకీయాలపై మాట్లాడేటప్పుడు వారు చాలా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది లేకుంటే దాని ప్రతికూల ప్రభావం మునిసిపల్ ఎన్నికలలో కనిపిస్తుంది. 

అయితే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మద్య సఖ్యత ఉన్నందున, రెండు పార్టీల మద్య కూడా సఖ్యత ఉండటం సహజమే. కనుక ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బాగుందని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెచ్చుకోవడం కూడా సహజమే. కానీ తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలలో జగన్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున జగన్‌ను మెచ్చుకొన్నా విమర్శించినా మునిసిపల్ ఎన్నికలలో తెరాసకు ఎంతో కొంత లాభం, నష్టం కలుగవచ్చు. లాభం రాకపోయినా పరువాలేదు కానీ నష్టం జరుగకూడదు కనుక మంత్రి కేటీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో మళ్ళీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 

“జగన్ పరిపాలన గురించి నేనేమీ చెప్పలేదు. జగన్ ప్రభుత్వ ప్రారంభం బాగుందని మాత్రమే అన్నాను. ప్రారంభం బాగుంటే సగం విజయం సాధించినట్లే. ఆయన పాలన ఏవిధంగా ఉందో ఏపీ ప్రజలే చెప్పాలి తప్ప తెలంగాణలో ఉన్న మేము కాదు. వారి అభిప్రాయమే ముఖ్యం తప్ప మాది కాదు. ఇక్కడ కూర్చొని మేము జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదు. త్వరలో ఏపీలో కూడా మునిసిపల్ ఎన్నికలు జరుగనున్నాయి కనుక వాటిలో ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసేఅవకాశం ఉంది. అయినా ఏపీ రాజకీయాలకు, తెలంగాణ మునిసిపల్ ఎన్నికలను ముడిపెట్టి మాట్లాడతామంటే శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడి పెట్టి మాట్లాడినట్లే ఉంటుంది,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ ‘కర్ర విరగకుండా...పాము చావకుండా...’చాలా లౌక్యంగానే మాట్లాడారు. దీనిపై ఆయన అభిప్రాయం, విధానం (లౌక్యం)రెండూ సరైనవేనని చెప్పవచ్చు. అయితే జగన్ ప్రభుత్వ పాలన గురించి తెరాస నేతలు ఏమనుకొంటున్నారో అందరికీ తెలుసు.


Related Post