30 ఇయర్స్ ఇండస్ట్రీ... పృధ్వీ అవుట్

January 13, 2020


img

“ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా...” అనే ఒక చిన్న డైలాగుతో చాలా పాపులర్ అయిన నటుడు పృధ్వీరాజ్‌ ఇటు తెలుగు సినీ రంగంలో...అటు సినీ ప్రేక్షకులలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాడు. కానీ రాజకీయాలలో అడుగుపెట్టగానే ఎదుటవారిపై బురద జల్లబోయి తానే అంటించుకొని నవ్వులపాలయ్యాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ...ఆరు నెలలోనే ఎదురుదెబ్బ తిన్నాడు. 

జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయం నుంచి అండగా నిలబడటంతో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనను శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. గతంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఎస్వీబీసీకి చైర్మన్‌గా సేవలందించినప్పుడు ఆయనపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు. ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేనివిదంగా చాలా చక్కగా సమర్ధంగా ఎస్వీబీసీని నిర్వహించి అందరి మన్ననలు పొంది, సగౌరవంగా తప్పుకొన్నారు. 

పృధ్వీరాజ్ కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చినవాడే కనుక ఆయన కూడా అంతే సమర్ధంగా, అంతే హుందాగా ఎస్వీబీసీని నిర్వహిస్తారని ఆశించడం సహజం. కానీ ఆయన ఆరు నెలలలోనే ఎస్వీబీసీలో కొందరు ఉద్యోగులను తొలగించడం, కొత్తగా తనకు నచ్చిన 35 మందిని నియమించుకోవడంతో చేజెతులా సమస్య సృష్టించుకొన్నారు. దానికి తోడు ఇటీవల ఆయన ఒక మహిళా ఉద్యోగినితో ఫోన్లో సరసాలు ఆడుతూ మాట్లాడిన మాటలు మీడియాకు లీక్ అవడంతో టిటిడి ప్రతిష్టకు భంగం కలిగింది. దాంతో ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని టిటిడి బోర్డు ఛైర్మన్ సుబ్బారెడ్డి సూచించడంతో పృధ్వీరాజ్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. 

అసలే కాస్త నోటి దురద ఎక్కువున్న పృధ్వీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలుపాలనే అత్యుత్సాహంతో  ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న అమరావతి మహిళా రైతులను కించపరుస్తూ వాళ్ళందరూ ‘పెయిడ్ ఆర్టిస్టులని’ ఎద్దేవా చేశారు. దానిపై జగన్ అభిమాని, ఆయన సహనటుడు పోసాని కృష్ణ మురళీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నోటి దురద ఉన్న ఇటువంటివారి వలన సిఎం జగన్‌కు, జగన్‌ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తోందని” మీడియా ద్వారా బహిరంగంగానే తప్పు పట్టారు. దానికి పృధ్వీ మళ్ళీ కౌంటర్ ఇచ్చినప్పటికీ సరిగ్గా ఇదే సమయంలో మహిళా ఉద్యోగినితో ఫోన్‌ సరసాల ఆడియో మీడియాకు లీక్ అవడంతో ఊహించని ట్విస్ట్ తో పృధ్వీ కధ ముగిసిపోయింది.  

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన తరువాత పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఏ తప్పు చేయలేదు. కానీ టిటిడి పెద్దల ఆదేశాలను పాటించి గౌరవంగా తప్పుకొంటున్నాను. నా ఎదుగుదలను చూడలేని గిట్టనివాళ్ళు ఎవరో ఆ నకిలీ ఆడియోను సృష్టించి లీక్ చేశారు. అది నా గొంతులా ఉన్నప్పటికీ అది నేను మాట్లాడినది కాదు. నా నిజాయితీని నిరూపించుకొన్న తరువాతే మళ్ళీ ఏ పదవి అయినా చేపడతాను. రాజధాని మహిళా రైతులను ఉద్దేశ్యించి నేను ఎటువంటి తప్పు మాట మాట్లాడలేదు. మీడియా నా మాటలను వక్రీకరించింది. దాంతో పోసానికి నాకు మద్యకమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేలా చేసి  మా మద్య ఎవరో గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది,” అని పృధ్వీ అన్నారు.


Related Post