రాష్ట్రంలో బిజెపికి నో ఛాన్స్: హరీష్‌రావు

December 14, 2019


img

మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌, బిజెపిలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తెరాస ఆత్మవిశ్వాసాన్ని చాటి చెపుతున్నట్లున్నాయి. శనివారం సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బిజెపిల పాలనను మీరందరూ చూశారు. ఆ రెండు పార్టీలు మాటలే తప్ప చేతల పార్టీలు కావు. కానీ గత ఐదున్నరేళ్ళలో కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూస్తున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం సైతం కాపీ కొడుతోందంటే అవి ఎంత గొప్పవో అర్ధమవుతుంది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకొంటున్నారు కనుక తెరాసను గెలిపించుకొంటున్నారు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి రెంటికీ ఇక స్థానం లేదు. ఎందుకంటే వాటి వలన ప్రజలకు, రాష్ట్రానికి గానీ ఎటువంటి ఉపయోగం లేదు,” అని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను తెరాసలోకి ఫిరాయింపజేయడం ద్వారా ఆ పార్టీని తెరాస చావు దెబ్బ తీయగలిగింది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలకున్న సొంత బలంతో ఎన్నికలలో నెగ్గుకు వస్తున్నారు. ఆవిధంగా నెగ్గిన వారిని కూడా తరువాత తెరాసలోకి రప్పించుకొంటున్నందున భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ప్రజలు కూడా వెనుకాడవచ్చు. కనుక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించగలిగితే తప్ప ఈ ఫిరాయింపుల సమస్యల నుంచి బయటపడలేదు. కాంగ్రెస్ పార్టీకి తెరాస ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. 

ఇక కేంద్రంలో బిజెపి తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉండటం రాష్ట్ర బిజెపికి కలిసివచ్చే అంశమే అయినా తెరాస పట్ల కేంద్రప్రభుత్వ వైఖరి రాష్ట్ర బిజెపికి ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటోంది. కనుక తెరాస తమ రాజకీయ శత్రువేనని ప్రజలను నమ్మించలేకపోతోంది. పైగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత, ఈటల రాజేందర్‌, జగదీష్ రెడ్డి వంటి హేమాహేమీలను ఎదుర్కొని నిలబడగలిగే నేతలు రాష్ట్ర బిజెపిలో కనబడరు. అందుకే ప్రతీ ఎన్నికలలో బిజెపి ఘోరపరాజయం పాలవుతుంటుందని చెప్పవచ్చు. 

రాష్ట్ర బిజెపి తెరాసకు సవాలు విసిరే స్థితిలో లేదని భావిస్తునందునే సిఎం కేసీఆర్‌ దానిని పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలేదని, జిఎస్టీలో రాష్ట్ర వాటాను సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడంలేదంటూ తెరాస నేతలు చేస్తున్న వాదనలలో నిజం ఉన్నప్పటికీ వాటికి బిజెపి నేతల వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు. అదే బిజెపి బలహీనతగా చెప్పవచ్చు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు స్థానం లేదని హరీష్‌రావు ధైర్యంగా చెప్పగలిగారనుకోవచ్చు.


Related Post