ఆర్టీసీలో సిఎం ఆదేశాలు బేఖాతర్: అశ్వధామరెడ్డి

December 14, 2019


img

ఆర్టీసీ సమ్మె మొదలైనప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి సమ్మె ముగిసేసరికి పత్తాలేకుండాపోవడం విశేషం. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకొని, ఆత్మీయ సమావేశం పేరిట సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో వారితో కలిసి భోజనం చేయడం, ఆర్టీసీకి, కార్మికులకు అనేక వరాలు ప్రకటించడంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎవరూ అశ్వధామరెడ్డిని పట్టించుకోవడం లేదు. 

మొదట సిఎం కేసీఆర్‌ మొండివైఖరి కారణంగానే 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు మరణించారని 55 రోజులపాటు ఆర్టీసీ సమ్మె కొనసాగిందని వాదించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు అదే కేసీఆర్‌కు జేజేలు కొడుతుండటంతో అశ్వధామరెడ్డి వంటి నేతలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పైగా రెండేళ్ళ వరకు యూనియన్లు వద్దని ఆర్టీసీ కార్మికులు సంతకాలు చేసి ఇస్తుండటంతో అశ్వధామరెడ్డితో సహా ఆర్టీసీ జేఏసీ నేతలకు పనిలేకుండాపోయింది. 

ఈ నేపధ్యంలో అశ్వధామరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం ఆర్టీసీలో కార్మికులెవరూ సంతోషంగా పనిచేయడం లేదు. నిర్బందంలో పనిచేస్తున్నారు. కార్మికచట్టాల ప్రకారం కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆర్టీసీలో యూనియన్లు ఉండొద్దని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇది సరికాదు. యూనియన్లు ఉండాలో వద్దో తేల్చుకొనేందుకు రహస్య ఓటింగ్ జరిపినట్లయితే తేలిపోతుంది కదా? ఆర్టీసీ మహిళా కార్మికులకు రాత్రి 8గంటలలోగా ఇంటికి చేరుకొనేలా డ్యూటీలు సర్దుబాటు చేయాలని సిఎం కేసీఆర్‌ చెప్పిన మాటలను డిపో మేనేజర్లు పట్టించుకోవడం లేదు. బెంగళూరులో 7,000 బస్సులు తిరుగుతుంటే హైదరాబాద్‌లో 3,500 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. మళ్ళీ వాటిలో 1,000 బస్సులు నిలిపివేయబోతోంది. దీంతో ఆర్టీసీ భారం తగ్గించుకోగలదేమో కానీ బస్సుల సంఖ్య తగ్గిపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా కొందరు డిపో మేనేజర్లు అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం వారందరిపై విచారణ జరిపించి కేసులు నమోదు చేయాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post