పసుపు రైతులకు త్వరలో శుభవార్త: అరవింద్

December 14, 2019


img

నిజామాబాద్‌ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది. తనను లోక్‌సభ ఎన్నికలలో గెలిపిస్తే, కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి 3 నెలల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్‌ హామీ ఇవ్వడంతో నిజామాబాద్‌ నియోజకవర్గంలో రైతులు సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్‌ కుమార్తె కవితను కాదని ఆయనకు ఓటేసి గెలిపించారు. 

ధర్మపురి అరవింద్‌ గెలిచి 6 నెలలయింది కానీ హామీ నిలబెట్టుకోలేకపోయారు. దానిపై ఆయనను పసుపు రైతులు నిలదీయగా ఆయన వారితో మాట్లాడుతూ, “మీరు ఆశిస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ మేలు చేయడానికే నేను కృషి చేస్తున్నాను. పసుపు బోర్డు ఏర్పాటు చాలా పాత ఆలోచన కనుక ఇప్పటి మీ సమస్యలు, అవసరాలకు తగిన్నట్లుగా కేంద్రప్రభుత్వం ఒక కొత్త పసుపు పాలసీని సిద్దం చేస్తోంది. దానిపై కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. నెల రోజులలో మీరు ఆ శుభవార్త వింటారు. ప్రస్తుతం అమలవుతున్న ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ స్కీమ్‌ (టైస్‌) పథకాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి రైతులకు మేలు కలిగేలా విధానాలను రూపొందిస్తున్నాము. అది అమలులోకి వస్తే భారీగా నిధులు అందుబాటులో ఉంటాయి. దాంతో పసుపు రైతుల సమస్యలన్నీ శాశ్విత ప్రాతిపదికన పరిష్కరింపబడతాయి. అతి త్వరలోనే మీరు ఆ శుభవార్త వింటారు,” అని చెప్పారు. 

నిజామాబాద్‌ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయమని రైతులు అడుగుతుంటే తాను హామీని నిలబెట్టుకోలేకపోతున్నానని చెప్పకుండా, అది చాలా పాత ఆలోచన అని, పసుపు రైతులకు మేలు కలిగేలా నూతన విధానం ప్రవేశపెడతామని ధర్మపురి అరవింద్‌ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు... కానీ అంతకు మించిన లబ్ది కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని’ ప్రకటించి ప్రజలను మభ్య పెట్టినట్లే, ఇప్పుడు బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ధర్మపురి అరవింద్‌ పసుపు రైతులను మభ్యపెడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. రాష్ట్ర స్థాయిలో పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే జాతీయస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పడమే అనుమానాలకు తావిస్తోంది.

నెల రోజులలో ఎలాగూ ఆ పాలసీ ప్రకటిస్తామని చెపుతున్నారు కనుక అప్పుడు దాని గొప్పదనం ఏమిటో...దాని వలన రాష్ట్రంలో పసుపు రైతులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అనే విషయం తేలిపోతుంది కనుక అంతవరకు రైతులు ఓపిక పట్టక తప్పదు.


Related Post