క్యాబ్ మంటలు ఆరేదెలా...

December 13, 2019


img

నేటితో పార్లమెంటులో శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. పౌరసత్వ సవరణ బిల్లు-2019 (క్యాబ్) చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలుపడం వెనువెంటనే రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపంగా అమలులోకి వచ్చింది. ఈ వివాదాస్పద చట్టాన్ని మోడీ ప్రభుత్వం చాలా అవలీలగా పార్లమెంటు చేత ఆమోదింపజేసుకొంది కానీ అది దేశంలో కొత్త చిచ్చు రగిలించిందని చెప్పక తప్పదు. పార్లమెంటులో సమావేశాలు ముగిసినప్పటికీ క్యాబ్ రగిల్చిన అగ్గితో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. క్యాబ్‌ను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలలో చాలా ఉదృత స్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ సెగలు డిల్లీకి కూడా పాకుతున్నాయి. సుప్రీంకోర్టులో అప్పుడే దానిని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపియేతర పార్టీలలో చాలా పార్టీలు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 



మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఐదున్నరేళ్ళుగా ఈశాన్య రాష్ట్రాలను చాలా అభివృద్ధి చేసింది. కానీ ఇప్పుడు ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆ రాష్ట్రాలలో వీలైనంత త్వరగా శాంతియుత వాతావరణం నెలకొల్పలేకపోతే గత 5 ఏళ్లుగా కేంద్రప్రభుత్వం చేసిన ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయే ప్రమాదం ఉంది. 


ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు చైనా, బాంగ్లాదేశ్‌లకు సరిహద్దులను ఆనుకొని ఉన్నందున ఈ ఆందోళనలు, అశాంతిని చైనా అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. అదేజరిగితే ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌తో వేగుతున్న భారత్‌కు అప్పుడు చైనా కూడా కొత్త తలనొప్పిగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ఈశాన్య రాష్ట్రాలలో రాజుకొన్న ఈ క్యాబ్ మంటలను కేంద్రప్రభుత్వం వెంటనే ఆర్పవలసి ఉంది. కానీ అక్కడ బారీగా సాయుధదళాలను దించి ప్రజలను ఆందోళనలు చేయకుండా నియంత్రించగలదేమో కానీ వారి ఆలోచనలను మార్చలేదు. కనుక క్యాబ్ మంటలు ఆర్పేందుకు ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించడం మంచిది. 


Related Post