ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదీ....

December 10, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు దానిని తమ విధానంగా అమలుచేస్తున్నారు కనుక. అయితే పోలీస్ శాఖలో నేటికీ కొంతమంది ప్రజలతో దురుసుగా, అనుచితంగా వ్యవహరిస్తున్నప్పటికీ అత్యధికులు ప్రజలకు చేరువయ్యారనే చెప్పవచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తాజా ఉదాహరణగా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై జరిగిన ఘటనను చెప్పుకోవచ్చు. 

నల్గొండకు చెందిన మారగొని శ్రీనివాస్, భరణీ దంపతులు విదేశాలకు వెళ్లవలసి ఉండటంతో శనివారం అర్దరాత్రి తమ కారులో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే రాత్రి సుమారు 2 గంటలకు వారి కారు ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఔటర్‌రింగ్‌ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13వద్దకు చేరుకొన్నప్పుడు కారు టైర్ పంక్చర్ అయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకల్లా వారు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోలేకపోతే విమానం మిస్ అయిపోతారు. కానీ ఆ సమయంలో ఔటర్‌రింగ్‌ రోడ్డుపై వారికి సహాయపడేవారెవరూ లేరు పైగా ప్రమాదం కూడా పొంచి ఉంది.

దాంతో ఏమి చేయాలో పాలుపోని ఆ దంపతులు 100 నెంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు తమ పరిస్థితిని వివరించి సహాయం అర్ధించారు. వెంటనే స్పందించిన ఆధిభట్ల పోలీసులు ఆరు నిమిషాలలోపే అక్కడకు చేరుకొన్నారు. కారు టైర్లకు పంక్చర్ వేసే వ్యక్తిని కూడా వెంటపెట్టుకొని మరీ వచ్చారు. వారిని చూడగానే ఆ దంపతులకు కొండంత ధైర్యం సంతోషం కలిగింది. కారు పంక్చర్ పని పూర్తి కాగానే వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకొని శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే కదా?


Related Post