ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై విమర్శలు: లక్ష్మణ్

December 10, 2019


img

కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయడం లేదంటూ సిఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖలు వ్రాయడాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తప్పు పట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మిగులు బడ్జెట్‌తో చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ళలోనే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన సిఎం కేసీఆర్‌ తన తప్పాలను, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ముఖ్యమంత్రే ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా అనాలోచితంగా ఖర్చులు చేస్తున్నప్పుడు అధికారులను నిందించి ప్రయోజనం ఏమిటి? ఆయన ఆదేశానుసారమే వారు పనులు చేస్తుంటారు కదా? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్న సిఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి కనుకనే కె.లక్ష్మణ్‌ వేలెత్తిచూపగలుగుతున్నారని చెప్పక తప్పదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరిట సానియా మీర్జాకు అప్పనంగా రూ.2 కోట్లు ఇవ్వడం, ప్రభుత్వ ఖర్చుతో బారీ స్థాయిలో యజ్ఞాలు యాగాలు చేస్తుండటం, వందల కోట్లు వ్యయంతో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించాలనుకోవడం, తన స్వగ్రామమైన చింతమడకలో ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం ఇవ్వాలనుకోవడం వంటివి అనేకం కనబడుతున్నాయి. 

ముఖ్యమంత్రి ఆర్టీసీకి ప్రకటిస్తున్న వరాలను చూసి భయమేసిందని ఆర్ధికమంత్రి హరీష్‌రావు చెప్పారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే సంపదను సృష్టించి దానినే అర్హులైన ప్రజలకు పంచిపెట్టాలనేది తమ ప్రభుత్వ ఆశయమని సిఎం కేసీఆర్‌ చెపుతుంటారు. అది చాలా మంచి ఆలోచనే కానీ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణను ఉల్లంఘిస్తుంటే, చివరికి రాష్ట్ర ప్రజలే దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంటుంది. కనుక పాలకులు ప్రజలకు వరాలు ప్రకటించకపోయినా పరువాలేదు కానీ తప్పనిసరిగా ఆర్ధిక క్రమశిక్షణ పాటించితేనే వారికీ, రాష్ట్రానికి, ప్రజలకు కూడా మంచిది. 


Related Post