చిత్తూరులో క్రైమ్ సీన్ రిక్రియేట్...

December 10, 2019


img

గత నెల 7వ తేదీన చిత్తూరు జిల్లాలో వర్షిత (5) అనే చిన్నారిని హత్యాచారం చేసిన పఠాన్ మహ్మద్ రఫీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ రవి మనోహరాచారి సోమవారం మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసులో నిందితుడు దోషి అని నిరూపించేందుకు చాలా బలమైన సాక్ష్యాధారాలు సేకరించాము. ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు కూడా వచ్చాయి. ఘటనా స్థలంలో క్రైమ్ సీన్ రిక్రెయేట్ (హత్యాచారం ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా జరిగిందో తెలుసుకొనే ప్రక్రియ) చేసి మరిన్ని ఆధారాలు సేకరించి ఫాస్ట్-ట్రాక్ కోర్టుకు సమర్పిస్తాము. కనుక నిందితుడికి చట్ట ప్రకారం కటినశిక్ష పడటం ఖాయమని భావిస్తున్నాము,” అని చెప్పారు. 

దిశ కేసులో క్రైమ్ సీన్ రిక్రెయేట్ చేసేందుకు పోలీసులు నలుగురు నిందితులను తెల్లవారుజామున ఘటనాస్థలంకు తీసుకువెళ్ళిన తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు వర్షిత హత్యాచారం కేసులో క్రైమ్ సీన్ రిక్రెయేట్ చేయాలనుకొంటున్నామని పోలీసులు చెప్పడంతో మళ్ళీ మరో ఎన్‌కౌంటర్‌ జరుగబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో జైళ్ళలో ఉన్న అటువంటి నేరస్తులందరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిన్న శాసనసభలో సాక్షిగా దిశ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సమర్ధించడమే కాక ‘కేసీఆర్‌కు హాట్స్ ఆఫ్’ అంటూ మెచ్చుకొన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారిని 21 రోజులలోపు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టం ప్రవేశపెడతామని నిన్ననే ప్రకటించారు. కనుక వర్షిత నిందితుడిని ఏవిధంగా శిక్షించబడతాడో చూడాలి.


Related Post