నిర్భయ దోషులకు ఉరిశిక్షకు ఏర్పాట్లు షురూ

December 10, 2019


img

2012, డిసెంబర్ 16వ తేదీన డిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన జరిగింది. ఆ కేసులో ఒక మైనర్ బాలుడితో సహా మొత్తం ఆరుగురు దోషులుగా నిర్ధారణ అయ్యింది. అయితే చట్ట ప్రకారం మైనర్ బాలుడిని శిక్షించడానికి వీలులేదు కనుక మూడేళ్ళు జువైనల్ హోంలో ఉంచి రహస్యంగా విడిచిపెట్టారు. 

మిగిలిన ఐదుగురిలో రాంసింగ్‌ అనే వ్యక్తి 2013లో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా మిగిలిన నలుగురు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్‌, పవన్ గుప్తాలకు సుప్రీంకోర్టు ఉరిశిక్షలు ఖరారు చేసింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఒకటి రెండు నెలలోనే తీర్పు వెలువడి దోషులందరికీ శిక్షలు పడతాయని అందరూ భావిస్తే, నేరస్తులు చట్టంలో అవకాశాలను, లొసుగులను ఉపయోగించుకొంటూ న్యాయపోరాటాలు కొనసాగిస్తూ శిక్షలు పడకుండా ఇంతకాలం తప్పించుకోగలిగారు. 

ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడినవారికి క్షమించనవసరంలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వయంగా తన మనసులో మాటను బయటపెట్టడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొనే  మార్గం కూడా మూసుకుపోయినట్లే స్పష్టం అయ్యింది. 

కనుక నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయడానికి తీహార్ జైలు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఉరిశిక్షలకు వినియోగించే ఉరిత్రాళ్ళను బిహార్‌లోని బక్సర్ కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేస్తుంటారు. ఈనెల 14లోగా 10 ఉరిత్రాళ్ళను అందజేయవలసిందిగా బక్సర్ జైలు అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. కనుక నిర్భయ అత్యాచారం జరిగిన రోజునే అంటే డిసెంబర్ 16న నలుగురు దోషులను డిల్లీలో తీహార్ జైల్లో  ఉరితీసే అవకాశముంది.


Related Post