దిశ ఎఫెక్ట్: తమిళనాడు పోలీసుల వినూత్న పద్దతి

December 09, 2019


img

దిశ, ఉన్నావ్ ఘటనలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపద్యంలో తమిళనాడులో అత్యాచారాలను అరికట్టేందుకు అక్కడి పోలీసులు పెడమార్గాలు పడుతున్న యువతను గుర్తించే పనిలో పడ్డారు. అశ్లీల చిత్రాల కారణంగానే యువకులు చెడు సహవాసాలకు అలవాటుపడి, తరువాత అత్యాచారాలకు పాల్పడుతున్నారని భావించిన తమిళనాడు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో రాష్ట్రంలో అదేపనిగా అశ్లీల చిత్రాలను చూస్తున్నవారిపై నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 మంది గంటల కొద్దీ అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తిరునల్వేలిలో ఆవిధంగా గుర్తించిన 15 మందిని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ మళ్ళీ అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు తెలిస్తే జైల్లో వేస్తామని గట్టిగా హెచ్చరించి విడిచిపెట్టమని తెలిపారు. 

గత కొన్నేళ్ళుగా దేశంలో ప్రజలందరికీ మొబైల్ ఫోన్లు...వాటిలో అపరిమిత ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి రావడంతో దానిని సద్వినియోగం చేసుకొని బాగుపడుతున్నవారికంటే అపరిచిత వ్యక్తులతో స్నేహాలు, పరిచయాలు, ప్రేమలు, డేటింగ్ పేరుతో శారీరిక సంబంధాలు పెట్టుకొనేవారి సంఖ్య చాలా పెరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశ్యంతో బహిరంగ ప్రదేశాలలో ఉచిత వైఫీ సౌకర్యం కల్పిస్తుంటే దానిని కూడా చాలామంది ఇటువంటి అశ్లీలచిత్రాలు చూసేందుకు వినియోగించుకొంటున్నారని తాజా సర్వేలో తేలింది. కనుక ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను నిషేదించాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నించగానే ప్రజల స్వేచ్చకు, వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకొంటోందంటూ సుప్రీంకోర్టులో కేసులు నమోదు అవడంతో కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు. 

ప్రపంచంలో అన్ని రంగాలలో అభివృద్ధికి దోహదపడుతున్న ఇంటర్నెట్టే సమాజంలో చెడు పెరిగేందుకు కూడా దోహదపడుతుండటం బాధకారమే. అయితే అగ్గిపుల్ల వంటి ఇంటర్నెట్‌తో జీవితాలలో వెలుగులు నింపుకోవచ్చు...లేదా ఇలాగ జీవితాలు కాలి బూడిద కావచ్చు. అంటే మనమే విచక్షణతో మెలగాలని స్పష్టమవుతోంది. అశ్లీల చిత్రాలను నిషేదించడం సాధ్యం కాదని తేలింది కనుక వాటి వలన సమాజంలో అత్యాచారాలు పెరుగకుండా నిరోదించేందుకు తమిళనాడు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సమర్ధనీయమేనని భావించవచ్చు.


Related Post