నేటి నుంచి గవర్నర్‌ రాష్ట్ర పర్యటన

December 09, 2019


img

నేటి నుంచి గవర్నర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ మూడు రోజులు రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ముందుగా యాదాద్రి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తరువాత వరంగల్‌ చేరుకొని అక్కడి వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాలను దర్శించుకొంటారు. రాత్రికి వరంగల్‌లోనే బస చేస్తారు. 

మంగళవారం ఉదయం కాళేశ్వరం చేరుకొని ప్రాజెక్టును సదర్శిస్తారు. సాయంత్రం రామగుండం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 

బుదవారం ఉదయం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ధర్మారం చౌరస్తా సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వరి నాన్ ఓవెన్ క్లాత్ బ్యాగుల తయారీసంస్థకు వెళ్ళి అక్కడ బ్యాగుల తయారుచేస్తున్న విధానాన్ని చూస్తారు. అక్కడి నుంచి పెద్దపల్లి చేరుకొని స్థానిక మహిళా సంఘాల అధ్వర్యంలో నడుస్తున్న సబల శానిటరీ నాప్కిన్ పరిశ్రమకు వెళ్ళి వారితో మాట్లాడుతారు. ఆ తరువాత గ్రామంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ను పరిశీలించి, భోజన విరామం తరువాత హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు. 

 గవర్నర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలియగానే రాజకీయవర్గాలు కాస్త ఉలిక్కి పడ్డాయి. ఎందుకంటే ఆమె గవర్నర్‌ పదవి చేపట్టక మునుపు తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది కనుకనే ఆమెను తెలంగాణ గవర్నర్‌ నియమించి ఉండవచ్చునని, ఆమె సహకారంతో కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పించవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదు. ఇప్పుడు మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవేవీ కనిపించడం లేదు. 


Related Post