ఎన్‌కౌంటర్‌పై సిపిఐ నారాయణ యూ టర్న్

December 09, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రజలు, మంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ గట్టిగా సమర్ధించారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు, రాజకీయనాయకులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌ను గట్టిగా సమర్ధించారు. సిపిఐ నేత నారాయణ కూడా వారిలో ఒకరు. 

అయితే సిపిఐ అధిష్టానం దానిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడంతో నారాయణ కూడా ఎన్‌కౌంటర్‌పై తాను చేసిన ప్రకటనను వెనక్కు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఎన్‌కౌంటర్‌పై నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతమైనవి. వాటితో మా పార్టీకి ఎటువంటి సంబందమూ లేదు. మా పార్టీ ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా వ్యతిరేకిస్తూ మా జాతీయకార్యవర్గం ఒక తీర్మానం చేసి ఆమోదించింది. కనుక నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తూ మాట్లాడినందుకు మా పార్టీకి, ప్రజలకు క్షమాపణ చెపుతున్నాను,” అని అన్నారు. 

దిశ ఘటనపై తెలంగాణతో సహా యావత్ దేశప్రజలు చాలా తీవ్రంగా స్పందించారు. కనుక నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారు తీవ్ర భావోద్వేగంతో స్పందించడం సహజం. కానీ చట్టాల గుర్తించి పూర్తి అవగాహన కలిగిన అధికార, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయనేతలు కూడా అత్యుత్సాహంతో స్పందించడమే విడ్డూరం.


Related Post