ఏపీలో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంపు!

December 07, 2019


img

ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పెద్దగా తేడా ఏమీ లేదనే చెప్పాలి. రెండు చోట్లా ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతూ నడుస్తుంటాయి. అయినా నష్టాల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నాయి. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక నష్టాల ఊబిలో నుంచి ఏవిధంగా బయటపడాలి...ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ప్రైవేట్ బస్సులు లాభాలు ఆర్జించగలుగుతున్నప్పుడు 80-90 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు ఎందుకు నష్టాల పాలవుతున్నాయి?అని ఆలోచించేబదులు టికెట్ ఛార్జీలు పెంచడమే ఏకైక పరిష్కారమన్నట్లు రెండు ప్రభుత్వాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాయి. 

ఏపీలో పల్లెవెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటరుకు 10 పైసలు, ఇతర సర్వీసులన్నిటిపై కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ఏపీ రవాణామంత్రి పేర్ని నాని శనివారం ప్రకటించారు. అయితే పెంచిన ఛార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీకి ఏటా 1,200 కోట్లు నష్టాలు వస్తున్నాయని కనుక ఛార్జీలు పెంచకుంటే ఆర్టీసీ దివాళా తీస్తుందని, అటువంటి పరిస్థితి రాకుండా నివారించేందుకే ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రిగారు శలవిచ్చారు. 

ఇప్పుడు బారీగా ఛార్జీలు పెంచారు కనుక ఇక నుంచి ఆర్టీసీ లాభాలు గడిస్తుందనుకొంటే పొరపాటే. మళ్ళీ వచ్చే ఏడాదో మరొకప్పుడో ఛార్జీలు పెంచుతున్నపుడూ ప్రభుత్వం మళ్ళీ ఇదే పాట పాడటం ఖాయం. అంటే ఛార్జీలు పెంచడం ఈ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం అవుతోంది. కనుక రెండు ప్రభుత్వాలు, రెండు ఆర్టీసీ యాజమాన్యాలు ఆర్టీసీని ఒడ్డుకు చేర్చగలిగే మార్గాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post