దిశ నిందితుల కుటుంబాల గోడు ఎవరు వింటారు?

December 07, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఒకపక్క దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంశలలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు, పోలీసులకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు, నిందితుల కుటుంబాల ఆక్రందనలు కనిపిస్తున్నాయి. 

ఈ కేసులో నలుగురు నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు చెందినవారవడంతో అక్కడ చాలా గంభీరమైన వాతావరణం నెలకొంది. నిన్న ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు టీవీ ఛాన్నాళ్లలో వార్తలు వచ్చినప్పటి నుంచివారు మృతదేహాల కోసం గుడిగండ్ల ప్రధానరహదారిపై బైటాయించి సాయంత్రం వరకు ఎదురుచూపులు చూస్తున్నారు. 

ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలిసినప్పటి నుంచి నిందితుల తల్లితండ్రులు, చెన్నకేశవులు భార్య రేణుక, వారి బందువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో ఇంతవరకు వారిపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారితో ఏవిధంగా వ్యవహరిచాలో తెలియనిస్థితిలో ఉన్నారు. కొంతమంది వారికి సానుభూతి తెలుపుతుండగా మిగిలినవారు వారికి దూరంగా ఉంటున్నారు. 

ఎన్‌కౌంటర్‌ తరువాత మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నందున అక్కడ బారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితులలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తే మరిన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక నిందితుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత సామూహిక ఖననం చేయాలని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణ జరపాలని నిర్ణయించడంతో సోమవారం విచారణ పూర్తయ్యేవరకు మృతదేహాలను మార్చురీలో భద్రపరచాలని ఆదేశించింది. 

తమ కొడుకులు, భర్త చేసింది క్షమించరాని నేరమేనని, కానీ వారిని కోర్టులో విచారించకుండా పోలీసులే వారిని ఎన్‌కౌంటర్‌ చేసి శిక్షించడాన్ని నిందితుల తల్లితండ్రులు, బందువులు తప్పుపడుతున్నారు. తాము బలహీనవర్గాలకు చెందినవారిమి కనుకనే పోలీసులు ఇంత ధైర్యం చేయగలిగారని, అదే...పెద్దవాళ్ళ పిల్లలు ఇటువంటి తప్పులు చేస్తే వారినీ ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తప్పులు చేసి జైళ్ళలో ఉన్నవారినందరినీ కూడా ఇలాగే ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం తమవారి శవాలను చివరి చూపు చూసేందుకు కూడా మాకు అవకాశం ఇవ్వరా? అని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెపుతారు? 


Related Post