దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

December 07, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రదీప్ కుమార్, జిఎస్ గని అనే ఇద్దరు న్యాయవాదులు  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇటువంటి కేసులలో అనుసరించవలసిన మార్గదర్శకాలను 2014లో సుప్రీంకోర్టు ప్రకటించింది. వాటిని పట్టించుకోకుండా తెలంగాణ పోలీసులు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకొని నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని పిటిషనర్లు ఫిర్యాదు చేశారు. కనుక  ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, పోలీస్ అధికారులపై తక్షణం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని వారు పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. 

ఇటువంటి కేసులలో పోలీసులు అనుసరించాల్సిన మార్గదర్శకాలు: 

1. ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే తప్పనిసరిగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. దానిని, డైరీ ఎంట్రీలను, పంచనామా వివరాలను వెంటనే కోర్టుకు సమర్పించాలి.  

2. ఎన్‌కౌంటర్‌ చేసిన తుపాకులను పోలీసులు తక్షణమే తమపై అధికారులకు అప్పగించాలి. దర్యాప్తు పూర్తయ్యేవరకు వాటిని తిరిగి వినియోగించకూడదు.  

3. పోలీసులతో పాటు సిఐడి కూడా దర్యాప్తు చేయాలి.  

4. మేజిస్ట్రేట్ కూడా దర్యాప్తు చేసి నిజానిజాలను దృవీకరించాలి. 

5. హతమైనవారికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నప్పుడు తప్పనిసరిగా వీడియో తీయాలి.

6.  ఎన్‌కౌంటర్‌ సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల సంఘానికి (ఎన్‌హెచ్ఆర్‌సీ) తెలియజేయాలి. ఎన్‌కౌంటర్‌కు సంబందించి పూర్తి వివరాలను ఎన్‌హెచ్ఆర్‌సీ అందజేసి వారి దర్యాప్తుకు పోలీసులు పూర్తిగా సహకరించాలి. 

7. ఒకవేళ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు రుజువైతే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంషించడం, అవార్డులు ఇవ్వడం, సన్మానాలు చేయడం వంటివి చేయరాదు. ఈ ఘటనలో వారు ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించబడిన తరువాతే వారికి డిపార్ట్మెంట్ పరంగా అవార్డులు ఇవ్వాలి.     

8. మృతుల కుటుంబాలకు ఎన్‌కౌంటర్‌కు సంబందించి పూర్తి వివరాలు అందజేసి, కేసులను బట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలి. 

9.  మృతుల కుటుంబీకులకు ఎన్‌కౌంటర్‌పై ఎటువంటి అనుమానాలు ఉన్నా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. 

 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే షాద్ నగర్ ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేశారు. దిశ నిందితులు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో తమపై హత్యాయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపామని, ఆ కాల్పులలో వారు చనిపోయారని షాద్ నగర్ ఏసీపీ వి. సురేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 307 కింద ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేశారు. మిగిలిన మార్గదర్శకాలను కూడా పాటిస్తున్నారు. కనుక సుప్రీంకోర్టులో ఈ కేసు నిలువకపోవచ్చు. 


Related Post