ఆర్టీసీలో మళ్ళీ లొల్లి షురూ

December 07, 2019


img

ఆర్టీసీలో మళ్ళీ కొత్త సమస్య మొదలైంది. ఆర్టీసీలో యూనియన్ నేతలే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెలు చేయిస్తూ ఆర్టీసీకి నష్టాలు కలిగిస్తున్నారని, కనుక యూనియన్లను అనుమతించబోమని సిఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగా చెప్పారు. ఆర్టీసీలో రెండేళ్ళు వరకు యూనియన్ ఎన్నికలు నిర్వహించబోమని, వాటికి బదులుగా ఒక్కో డిపో నుంచి ఇద్దరు-ముగ్గురు చొప్పున ఆర్టీసీ కార్మికులతో సంక్షేమ సంఘం ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

సమ్మె విరమణ చేసిన తరువాత తామందరం బేషరతుగా విధులలో చేరుతామని, యూనియన్ల జోలికి వెళ్లబోమని ఆర్టీసీ కార్మికులు పదేపదే చెప్పారు. ప్రగతి భవన్‌లో ఆత్మీయసమావేశం సందర్భంగా సిఎం కేసీఆర్‌ కేసీఆర్‌ చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవించిన ఆర్టీసీ కార్మికులు అందుకు సమ్మతించి కేసీఆర్‌కు జైకొట్టి, పాలాభిషేకాలు చేసి మరీ విధులలో చేరారు.

అయితే నేటికీ ఆర్టీసీలో యూనియన్లు ఉండాలని కోరుకొనేవారు కూడా చాలా మందే ఉన్నారు. యూనియన్లు ఉండాలో వద్దో ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకోవాలి తప్ప ప్రభుత్వమొ ఆర్టీసీ యాజమాన్యమొ కాదని యూనియన్ నేతలు వాదిస్తున్నారు. యూనియన్లు ఉన్నప్పుడే అధికారులు తమను వేదిస్తున్నారని యూనియన్లు లేకుంటే తమను కట్టుబానిసలుగా చూస్తారని యూనియన్ నేతలు వాదిస్తున్నారు. కనుక యూనియన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు చీలిపోతున్నారు.

ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాల మేరకు డిపో మేనేజర్లు ఆర్టీసీ కార్మికుల వద్ద నుంచి ‘రెండేళ్ళ వరకు యూనియన్లు వద్దని’ వ్రాసిన లేఖలపై సంతకాలు తీసుకొంటుంటే, ‘యూనియన్లు ఉండాలని’ కోరుతూ యూనియన్ నేతలు సంతకాలు సేకరిస్తున్నారు. దీంతో చాలా డిపోలలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే విషయమై శుక్రవారం మహబూబ్‌నగర్‌ డిపో మేనేజరుకు ఆర్టీసీ కార్మికులకు మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. యూనియన్ కావాలంటూ సంతకాల సేకరణ చేస్తున్న జేఏసీ నేత నరసింహను డిపోలోకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా చేశారు. పోలీసులు వచ్చి ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పి లోపలకు పంపించేశారు. మళ్ళీ రాజుకొన్న ఈ యూనియన్ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందో?


Related Post