మాకూ న్యాయం చేయండి: హాజీపూర్ వాసులు

December 07, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది, దిశకు న్యాయం జరిగిందని, ఇకపై మళ్ళీ ఎవరూ ఇటువంటి ఆలోచన చేయడానికి కూడా భయపడతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి ఇటువంటి కేసులలో నిందితులు జైలులో ఉన్నవారిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని భాదిత కుటుంబాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. 

ఆరు నెలల క్రితం హన్మకొండలో శ్రీహిత అనే 9 నెలల చిన్నారి తల్లి పక్కలో నిద్రిస్తునప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి పాపను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసు విచారణ జరిపిన వరంగల్ కోర్టు అతనికి ఉరి శిక్ష వేసింది. అయితే నేటికీ అది అమలుచేయకపోవడంతో శ్రీహిత తల్లి రచన తమకు ఎప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అతనిని కూడా పోలీసులు ఎంకౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఈ ఏడాది మేలో వెలుగు చూసిన హాజీపూర్ బాలికల వరుస హత్యాచారాల కేసు ఇంకా కొనసాగుతున్నందున నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఇంతవరకు శిక్ష పడలేదు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత హాజీపూర్ వాసులు శుక్రవారం గ్రామ చౌరస్తాలో ధర్నా చేశారు. శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు ఎంకౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 

లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్‌కు చెందిన శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, గ్రామశివార్లలో గల పాడుబడిన బావిలో పూడ్చి పెట్టేడు. ఆ తరువాత తనపై ఎవరికీ అనుమానం రాకుండా గ్రామస్తులతో కలిసి బాలికల ఆచూకీ కోసం గాలించేవాడు. కానీ చివరికి పట్టుబడ్డాడు. కానీ ఇంతవరకు శిక్ష పడకపోవడంతో హాజీపూర్ వాసులు అతనిని ఎంకౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తరువాత దేశవ్యాప్తంగా ఇటువంటి డిమాండ్లు మొదలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు పెరగడానికి కారణం కేసుల విచారణలో జాప్యం కారణంగా నిందితులకు శిక్షలు పడకపోవడంతో ప్రజలలో అసహనం పెరిగిపోవడమేనని చెప్పవచ్చు. కనుక ఇటువంటి కేసులకు సంబందించి చట్ట సవరణలు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నిందితులకు శిక్షలుపడేలా చేయవలసి ఉంది.


Related Post