అప్పుడు వెనకేసుకువచ్చి ఇప్పుడు సస్పెండ్!

December 02, 2019


img

హత్యాచారానికి గురైన ప్రియాంకా రెడ్డి కేసులో ఒక సబ్-ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రియాంకా రెడ్డి ప్రమాద స్థితిలో ఉందని గ్రహించిన ఆమె తల్లి, సోదరి కలిసి రాత్రి 11 గంటలకు శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయగా ఆ కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాదని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని పంపించేశారు. అంత రాత్రిపూట వారిరువురూ అక్కడకు వెళ్ళి ఫిర్యాదు చేయబోతే వారు కూడా అది తమ స్టేషన్ పరిధిలోకి రాదని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకే వస్తుందని తిప్పి పంపేశారు.

దాంతో వారివురూ మళ్ళీ శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని విషయం చెప్పి ఫిర్యాదు నమోదు చేసుకొని ప్రియాంకా రెడ్డి కోసం గాలింపు మొదలుపెట్టాలని వేడుకొన్నారు. అయితే ‘ఆమెకు ఎవరితోనైనా లవ్ ఎఫైర్ ఉందా? ఉంటే వాడితో లేచిపోయిందేమో?’ అన్నట్లు పోలీసులు మాట్లాడారని ప్రియాంకా రెడ్డి తల్లి చెప్పారు.

ఒకవైపు కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో భయాందోళనలతో ఉన్న తమకు ధైర్యం చెప్పి అండగా నిలబడవలసిన పోలీసులు ఆడవాళ్ళనే ఆలోచన, కనికరం కూడా లేకుండా చాలా అనుచితంగా మాట్లాడటమే కాకుండా అర్ధరాత్రిపూట రెండు పోలీస్‌స్టేషన్ల మద్య తిప్పించారని ప్రియాంకా రెడ్డి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉండి ఉంటే తమ కూతురు ప్రాణాలతో దక్కి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా కూతురు చనిపోయిన తరువాత ఎంతమంది పోలీసులు పరుగులు పెడితే మాత్రం ఏమి ప్రయోజనం? చపోయిన మా కూతురుని తిరిగి తీసుకువచ్చి ఇవ్వగలరా? అనే వారి ప్రశ్నకు పోలీసులు కూడా సమాధానం చెప్పలేకపోయారు. 

ఈ విషయంలో మీడియాలో వచ్చేసరికి సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్‌మీట్‌ పెట్టి, తమ సిబ్బందిని వెంకేసుకువస్తూ వారు ఎటువంటి తప్పు చేయలేదని, నిబందనల ప్రకారమే నడుచుకొన్నారని సమర్ధించుకొన్నారు. కానీ ప్రియాంకా రెడ్డి తల్లితండ్రులు చెప్పిన ఈ విషయాన్ని జాతీయ మహిళా కమీషన్ సీరియస్‌గా తీసుకొని నివేదిక కోరడంతో అప్పుడు వెనకేసుకువచ్చిన పోలీసులపైనే సజ్జనార్ సస్పెన్షన్ వేటు వేశారు. 

శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా చేస్తున్నఎం రవికుమార్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న ఏ సత్యనారాయణ గౌడ్, పి.వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 


Related Post