అప్పుడే మాట్లాడి ఉంటే 30 ప్రాణాలు నిలిచేవి కదా?

December 02, 2019


img

అక్టోబర్ 5న ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి సిఎం కేసీఆర్‌ చెప్పిన మాటలకు, నిన్న ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయసమావేశంలో చెప్పిన మాటలకు, ఇచ్చిన వరాలకు ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. 

మొదట చర్చలకే ఇష్టపడని కేసీఆర్‌ ఆత్మీయసమావేశం పేరిట నిన్న ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలన్నిటినీ అడిగి తెలుసుకొన్నారు. 

కార్మిక చట్టాల ప్రకారం సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించనవసరం లేదని తిరిగి వారి జీతాలు కోసుకోవచ్చునని వాదించిన కేసీఆర్‌ సమ్మె కాలానికి కూడా పూర్తి జీతం ఒకేసారి చెల్లిస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వం ఎల్లకాలం ఆదుకోలేదని చెప్పిన సిఎం కేసీఆర్‌ ఏటా ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఆర్టీసీకి బకాయి పడ్డ పీఎఫ్, సొసైటీ సొమ్మును త్వరలో తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. 

కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు, యూనియన్ నేతలే కారణమని వాదించిన కేసీఆర్‌, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం, 8 రోజులలోగా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 

ఇక ఆర్టీసీలో మహిళా కండక్టర్ల సమస్యలు, బస్సుల మరమత్తులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు, ఆర్టీసీ కార్మికులకు కనీస సౌకర్యాలు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కేటాయింపు వంటి అన్నిటిపై సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి, తక్షణమే వాటి ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. సిఎం కేసీఆర్‌ ఇంత ఆప్యాయంగా, ఇంత సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ కార్మికులు..ముఖ్యంగా మహిళా కార్మికులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్‌కు జేజేలు పలికారు. 

సిఎం కేసీఆర్‌ నిన్నటి విందు సమావేశంలో ఆర్టీసీకి, కార్మికులకు ఇచ్చిన వరాలను ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అందరూ స్వాగతించారు.

మొదట ఆర్టీసీ కార్మికులతో ఐఏస్‌ అధికారులతో చర్చలు నిర్వహించే బదులు సిఎం కేసీఆర్‌ స్వయంగా ఇటువంటి ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసి కార్మికులతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి ఉండి ఉంటే, ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేసి ఉండేవారు కాదు. సమ్మె కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం కలిగి ఉండేది కాదు. 55 రోజులు ప్రజలు,ఆర్టీసీ కార్మికులు నానా ఇబ్బందులు పడేవారు కాదు. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యానికి ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కారు. అలాగే 30 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయేవారు కాదు. హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడేవి కావు. తత్ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యంగా ప్రజల దృష్టిలో సిఎం కేసీఆర్‌, తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పలుచన అయ్యేవారు కాదు కదా అని అందరూ అనుకొంటున్నారు. చివరికి ఆర్టీసీ కార్మికులు కోరుకొన్నవన్నీ ఇచ్చారు. సిఎం కేసీఆర్‌ పంతానికి ఇంతమంది ఇంత భారీ మూల్యం చెల్లించవలసివచ్చిందని జనాభిప్రాయం వినబడుతోంది.


Related Post