ప్రియాంకా రెడ్డి హత్యపై ప్రజాగ్రహానికి కారణం ఏమిటి?

November 30, 2019


img

శనివారం షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నెలకొన్న పరిస్థితులు పాలకులకు, పోలీసులకు, చివరికి న్యాయస్థానాలకు కూడా ఒక హెచ్చరికగా చూడవలసి ఉంటుంది. ప్రియాంకా రెడ్డి హత్యపై ప్రజలు ఇంత తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడానికి కారణం ఇటువంటి హేయమైన నేరాలు జరుగుతున్నప్పటికీ చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు వారిని శిక్షించలేకపోతున్నాయనే బాధ, ఆక్రోశమే అని భావించవలసి ఉంటుంది. అందుకే ఇవాళ్ళ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నేరస్తులను స్వయంగా శిక్షించడానికి సిద్దపడ్డారు.        

అయితే ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు దీనిని శాంతి భద్రతల సమస్యగానే చూస్తుంటాయి తప్ప వారి ఆగ్రహానికి కారణాన్ని పట్టి చూడాలనుకోవు. నిర్భయ సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం కటినమైన చట్టాలను తీసుకువచ్చింది. కానీ నేటికీ నిర్భయ నిందితులకు శిక్షలు అమలుకానే లేదు. పైగా నిర్భయ ఉదంతం తరువాత దేశంలో సామూహిక అత్యాచారాలు పెరిగిపోయాయి. అయినప్పటికీ అనేక కారణాల వలన చాలా కేసులలో దోషులకు శిక్షలు అమలుకావడం లేదు. ఆ కారణంగా ఇటువంటి నేరాలకు పాల్పడేవారిలో ‘భయం పుట్టడంలేదు.’ దాంతో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 

పైగా మీడియా, ప్రజలు, ప్రభుత్వం, పోలీసులు, ప్రతిపక్షాలు ఎప్పుడు స్పందిస్తాయో ఎప్పుడు స్పందించవో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు ప్రియాంకా రెడ్డి కేసుపై ఇంతగా స్పందిస్తున్న అందరూ ఒక రోజు ముందు అంటే బుదవారం హన్మకొండలోని హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో 19 ఏళ్ళ బాలికపై జరిగిన హత్యాచారం పెద్దగా స్పందించలేదు. ఒకే రకం ఘటనలపై ప్రజలు, మీడియా, ప్రభుత్వం, ప్రతిపక్షాలే ఇంత భిన్నంగా స్పందిస్తున్నప్పుడు దోషులకు కూడా భయం కలుగదు. అంటే నేరనియంత్రణలో సమాజం, వ్యవస్థల స్పందన కూడా చాలా ముఖ్యమని అర్ధమవుతోంది.

హైదరాబాద్‌ లేదా పెద్ద పట్టణాలలో తప్ప మారుమూల గ్రామాలలో హత్యలు, అత్యాచారాలు జరిగినా ఎవరూ పట్టించుకోనప్పుడు అవకాశం చిక్కినప్పుడు నేరస్తులు ఇటువంటి నేరాలకు పాల్పడుతుంటారు. అందుకు హాజీపూర్ వరుస హత్యాచారాలను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ ఘటనలపై కొన్ని రోజులు అందరూ హడావుడి చేశారు. ఆ తరువాత అందరూ మరిచిపోయారు. అయితే నేటికీ హాజీపూర్ వాసులకు ప్రభుత్వం, పోలీసులు భరోసా కల్పించలేకపోయారు. కనుక నేటికీ వారిలో భయాలు అలాగే ఉన్నాయి. నేటికీ హాజీపూర్ ఆడపిల్లలు తమ మాన ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళి వస్తున్నారు. 

విషాదకర ఘటనల నుంచి పాలకులు పాఠాలు నేర్చుకొని మళ్ళీ అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సమస్య వచ్చినప్పుడు మేల్కొని హడావుడి చేయడమే తప్ప వ్యవస్థలో మార్పు రావడం లేదు. కనుక ఇటువంటి విషాదకరమైన, హేయమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో...వ్యవస్థలలో మార్పు, స్పందన లేకుండా ఇకపై ఇటువంటివి జరుగకూడదని కోరుకోవడం అత్యాశే అవుతుంది కదా?


Related Post