మౌనం వీడుతున్న తెరాస నేతలు

November 30, 2019


img

ఆర్టీసీ సమ్మె (అక్టోబర్ 5) మొదలైన కొత్తలో తెరాస ఎంపీ కే కేశవరావు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ తరువాత చల్లబడిపోయారు. ఆ తరువాత ఒకరిద్దరు తెరాస నేతలు ప్రభుత్వవైఖరిని సమర్ధిస్తూ మాట్లాడారు. కానీ వారిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వారు వెనక్కు తగ్గారు. అప్పటి నుంచి మొన్న ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరవచ్చునంటూ సిఎం కేసీఆర్‌ ప్రకటన చేసే వరకు తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అందరూ మౌనంగా ఉండిపోయారు. ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఎవరూ నోరువిప్పలేదు. చివరికి ఆర్టీసీ కార్మికులు మళ్ళీ విధులలో చేరడంతో రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం ఏర్పడింది. దాంతో ఇంతకాలంగా ఆర్టీసీ సమస్యపై నోరు విప్పడానికి సాహసించేలేకపోయిన తెరాస నేతలు మళ్ళీ మాట్లాడసాగారు.  

తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ సమ్మెకు సిఎం కేసీఆర్‌ చాలా చక్కటి ముగింపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకొని మనసున్న మారాజుననిపించుకొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సిఎం కేసీఆర్‌, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నందునే ప్రజలు వరుసగా రెండుసార్లు తెరాసను గెలిపించుకొన్నారు,” అని అన్నారు.


Related Post