ఆర్టీసీపై సిఎం కేసీఆర్‌ నేడు సమీక్షా సమావేశం

November 21, 2019


img

ప్రభుత్వం అంగీకరిస్తే బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరేందుకు సిద్దంగా ఉన్నమనే ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై సిఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ చివరికి తన పంతం నెగ్గించుకొన్నారు కనుక ఆర్టీసీ కార్మికులను విధులలో తీసుకోవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వానికి, తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు, విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఆ కారణంగా ప్రజలలో వ్యతిరేకత కూడా పెరిగింది. కనుక ఇంకా పంతానికి పోతే కొత్త సమస్యలు పుట్టుకు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఆర్టీసీ కార్మికులను విధులలో చేర్చుకొనేందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించవచ్చు.    

కానీ ప్రభుత్వం కూడా బేషరతుగా ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవాలనే ఆర్టీసీ జేఏసీ షరతుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించకపోవచ్చు. మళ్ళీ సమ్మె చేయకుండా ఉండేందుకు కొన్ని షరతులను విధించవచ్చు. వాటికి ఆర్టీసీ కార్మిక సంఘాలు అంగీకరిస్తేనే వారిని మళ్ళీ విధులలో తీసుకోవచ్చు. అప్పుడే ఈ సమస్య ‘తాత్కాలికంగా’ పరిష్కారం అవుతుంది. 

ఒకవేళ ఆర్టీసీ కార్మికులను విధులలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లయితే సమీక్షా సమావేశం తరువాత సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి తమ నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. 


Related Post