పిల్లికి చెలగాటం...ఎలక్కి ప్రాణసంకటం

November 20, 2019


img

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడటంతో 47 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారు. ఆర్టీసీ సమస్యను రెండు వారాలలోగా కార్మిక న్యాయస్థానం పరిష్కరించాలని హైకోర్టు సూచించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఒత్తిడి, ఆందోళన, అయోమయానికి గురికాగా ప్రభుత్వానికి చాలా ఉపశమనం లభించినట్లయింది. 

ఇప్పటికే 47 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మరో రెండువారాల వరకు వేచి చూడాలంటే కష్టమే. అప్పుడైనా లేబర్ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందో లేదో తెలియదు. కనుక సమ్మెను కొనసాగించలా వద్దా? కొనసాగిస్తే ఏమవుతుంది? నిలిపివేస్తే ఏమవుతుంది? అని నిన్న రాత్రి వరకు ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా చర్చించుకొన్నాయి. 

వారిలో కొందరు సమ్మె విరమించి విధులలో చేరుతామని ప్రభుత్వానికి చెప్పాలని సూచించారు. అవసరమైతే మధ్యవర్తుల ద్వారా సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. సమ్మె ఇంకా కొనసాగిస్తే 48,000 ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఇంకా అనేక మంది కార్మికులు చనిపోయే ప్రమాదం ఉందని కనుక సమ్మెను ముగించడమే మంచిదని కొందరు సూచించారు.    

కానీ సమ్మె విరమించినా ప్రభుత్వం తమను ఉద్యోగాలలోకి తీసుకోకపోతే నష్టపోతామని, అప్పుడు ప్రభుత్వం, కోర్టులు కూడా తమను పట్టించుకోవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ బేషరతుగా తమను విధులలో చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించినా, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్దమవుతున్నందున భవిష్యత్‌లో తమకు ఉద్యోగభద్రత ఉండదని కనుక సమ్మె కొనసాగించక తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ఒక్క డిమాండ్‌పై కూడా ప్రభుత్వం నుంచి హామీ లభించకుండా ఉద్యోగాలలో చేరితే ప్రభుత్వానికి మరింత అలుసైపోతామని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో దీనిపై అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత ఆర్టీసీ జేఏసీకి అప్పగించారు. దాంతో మళ్ళీ సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ సమస్యపై న్యాయనిపుణులతో మాట్లాడి ముందుకు సాగాలని నిర్ణయించుకొన్నారు. హైకోర్టు, లేబర్ కోర్టు తీర్పులు వచ్చే           వరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 47రోజులు సమ్మె చేసిన తరువాత తమకు ఇటువంటి అయోమయ పరిస్థితి వస్తుందని బహుశః ఆర్టీసీ కార్మిక సంఘాలు ఊహించి ఉండవు. ఇప్పుడు వారికిది జీవన్మరణ సమస్యగా మారింది. 

ఇంత సుదీర్గ విచారణ తరువాత హైకోర్టు చేతులెత్తేయడంతో ప్రభుత్వానికి చాలా ఉపశమనం లభించినట్లయింది. ఆర్టీసీ సమ్మె కేసు లేబర్ కోర్టుకు మారింది కనుక అది తేలేవరకు ప్రభుత్వం తాపీగా వేచి చూసేందుకే మొగ్గు చూపవచ్చు. అవసరమైతే మళ్ళీ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ కేసు విషయంలో ఇక ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి లేనట్లే భావించవచ్చు. 

ఇక ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలో తెరాస సర్కార్‌పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను, శాంతి భద్రతల సమస్యలను, పార్టీలో తిరుగుబాటు లేదా కేంద్రం జోక్యం చేసుకొనే ప్రమాదాలను రాజకీయంగా పరిష్కరించుకొనే శక్తి సిఎం కేసీఆర్‌కు ఉంది కనుక ఇక ఆర్టీసీ సమ్మె గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదనే భావించవచ్చు. ఈ పరిణామాలన్నిటినీ కలిపి చూసినట్లయితే ఆర్టీసీ సమ్మె విషయంలో పిల్లికి చెలగాటం...ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లుగా మారినట్లు చెప్పవచ్చు.


Related Post