ఆర్టీసీ ప్రయివేటీకరణపై హైకోర్టు ఏమందంటే...

November 19, 2019


img

ఆర్టీసీ ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తే దానిని కాదనలేమని స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం తప్పా ఒప్పా? అనే విషయంతో తమకు సంబందం ఉండదని, ఆ నిర్ణయం చట్టబద్దంగా ఉందా లేదా? అనేదే తమకు ముఖ్యమని హైకోర్టు తేల్చి చెప్పింది. కనుక ఆర్టీసీ ప్రైవేటీకరణ గురించి సిఎం కేసీఆర్‌ మీడియాతో ఏమి మాట్లాడారో తమకు అనవసరమని, మంత్రివర్గ నిర్ణయాన్నే తాము పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. 

ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఒక్కటే ఉండేదని కానీ ప్రైవేట్ విమాన సర్వీసులకు అనుమతించిన తరువాత ప్రజలకు మరింత సదుపాయం కలిగిందని, కనుక ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం తప్పు కాదన్నట్లు హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీని యధాతధంగా నడపాలా లేక సమాంతరంగా ప్రైవేట్ బస్సులను అనుమతించాలా...అనే అంశం ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, కనుక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు చట్ట వ్యతిరేకంగా ఉంటే తప్ప వాటిలో కలుగజేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపు, ఆత్మహత్యలపై దాఖలైన వేరే పిటిషన్లపై విచారణను బుదవారానికి వాయిదా వేసింది.    

ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది కనుక ఆర్టీసీలో 5,100 ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు. ఒకవేళ ఆర్టీసీలో 50 శాతం ప్రైవేట్ బస్సులు చేరినట్లయితే, ఒకవేళ ఆర్టీసీ కార్మికులను మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకొన్నట్లయితే, వారిలో 50 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరి ఆర్టీసీ కార్మికులు ఈ సమస్యల నుంచి ఏవిధంగా బయటపడతారో? 


Related Post