ఆర్టీసీ కార్మికులను తిరిగి తీసుకోవడం కష్టమే: సునీల్ శర్మ

November 16, 2019


img

ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ శనివారం హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తరపున తుది అఫిడవిట్‌ సమర్పించారు.  1. ప్రజావసరాలను తీర్చే రంగంలో పనిచేస్తున్న వారు సమ్మె నోటీస్ ఇవ్వడమే చట్ట విరుద్దమని, కనుక ఆర్టీసీ కార్మికుల సమ్మె  చట్ట విరుద్దమని మరోసారి స్పష్టం చేశారు. కనుక సమ్మె చట్టవిరుద్దమని ప్రత్యేకంగా ప్రకటించనవసరం లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

2. కార్మిక శాఖ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ వారు తమ స్వప్రయోజనాల కోసమే చర్చలలో పాల్గొనకుండా సమ్మెకు వెళ్లారని, వారి సమ్మె వలన ఆర్టీసీ ఇంకా నష్టాలలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. 

3. ఆర్టీసీ యూనియన్ నేతలు, ప్రతిపక్షాలు తమ స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టడం ద్వారా భవిష్యత్‌లో మళ్ళీ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేయాలనే దురుదేశ్యం కనిపిస్తోందని, కనుక ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు చేపట్టలేమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

4. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు తామంతట తాముగా బేషరతుగా విధులలో చేరేందుకు వచ్చినప్పటికీ, వారి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఆర్టీసీ యాజమాన్యం ఉందని తెలిపారు. 

5. ఆర్టీసీ సమ్మె వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక హైకోర్టు వీలైనంత త్వరగా నిర్ధిష్టమైన తీర్పునివ్వాలని అఫిడవిట్‌లో కోరారు.

తాజా అఫిడవిట్‌ను చూస్తే ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొదటిరోజున ఎటువంటి వైఖరితో ఉందో నేటికీ అదే వైఖరితో ఉందని అర్ధం అవుతోంది.


Related Post