తెరాసకు ఉలికిపాటు ఎందుకు? బిజెపి ప్రశ్న

November 16, 2019


img

కొందరు తెరాస ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలపై తెరాస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానిపై బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రారావు స్పందిస్తూ, “ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకొంటే తప్పు లేదు కానీ తెరాస ఎమ్మెల్యేలు బిజెపితో టచ్‌లో ఉన్నరంటే తెరాసకు అంతా ఉలికిపాటు దేనికి? వారు చేర్చుకొంటే నైతికం...మేము చేర్చుకొంటే అనైతికం ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు. 

ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ “ఆర్టీసీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు ఆర్టీసీ కార్మికులను ఏమి చేయాలనుకొంటోంది ఈ ప్రభుత్వం? ఆవుల నరేశ్ అనే ఆర్టీసీ కార్మికుడు తాను ముఖ్యమంత్రి కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నానని స్పష్టంగా లేఖలో వ్రాసినా ఇంతవరకు పోలీసులు సిఎం కేసీఆర్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదు?”అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వారికి బిజెపి అండగా ఉంటుందని రామచంద్రారావు అన్నారు. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు నైతిక విలువలను, పార్టీ సిద్దాంతాలను, ప్రజాస్వామ్య పద్దతులను పక్కన బెట్టి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కనుక రాజకీయాలలో కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫిరాయింపులు వంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. ఈ అవాంఛనీయమైన అవలక్షణాలకు మళ్ళీ రాజకీయపార్టీలే భారీగా మూల్యం చెల్లించుకొంటున్నప్పటికీ ఎవరూ వెనక్కు తగ్గకపోవడం విచిత్రం. ఎవరి శక్తిని బట్టి వారు ఎదుటవారిని దెబ్బ తీసి అధికారం నిలబెట్టుకోవాలనో లేదా చేజిక్కించుకోవాలనో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అన్నట్లు ప్రజాస్వామ్యం ముసుగులో ఆటవిక పోకడలు సాగుతున్నాయి. కనుక తెరాస మొదలుపెట్టిన ఫిరాయింపుల గేమ్‌ను బిజెపి అందిపుచ్చుకోవాలనుకుంటే ఆశ్చర్యం లేదు. 

ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తోందే తప్ప వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం లేదు. కనుక అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నాయని చెప్పక తప్పదు.


Related Post