పార్లమెంటులో ఆర్టీసీ ప్రస్తావన వస్తే...

November 15, 2019


img

ఈనెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. కనుక తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్లమెంటరీ సమావేశం నిర్వహించి, పార్లమెంటులో చర్చించాల్సిన అంశాల గురించి ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన సమస్యలపై కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేటీఆర్‌ తెరాస ఎంపీలకు సూచించారు. వారు ఎలాగూ పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూనే ఉంటారు. అయితే ఈసారి వారికీ, తెలంగాణ ప్రభుత్వానికి కూడా పార్లమెంటులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. 

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్‌, బిజెపి మద్దతు ఇస్తున్నందున ఆ రెండు పార్టీలకు చెందిన ఏడుగురు ఎంపీలు ఆర్టీసీ సమ్మె గురించి, 30 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయిన సంగతీ పార్లమెంటులో ప్రస్తావించకమానరు. వామపక్షాలు కూడా సమ్మెకు మద్దతుయిస్తునందున వారికి ఇతర రాష్ట్రాలకు చెందిన వామపక్షాల ఎంపీలు మద్దతు పలకవచ్చు. పార్లమెంటులో ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు మరణాలపై చర్చ జరిగితే తెరాస ఎంపీలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఇబ్బందికరమో చెప్పనక్కరలేదు.  

గతంలో ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యల గురించి కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంటు సాక్షిగా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరిన సంగతి అందరికీ తెలుసు. 

ఈసారి 48,000 మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటుతో మరణిస్తూనే ఉన్నారు. సమ్మె వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమ్మె వలన శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. హైకోర్టు కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పి విఫలమైంది. ఈవిషయాలన్నీ కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించకుండా ఉండరు. అప్పుడు పార్లమెంటు సభ్యులు, కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం కష్టం. కనుక పార్లమెంటులో తెరాస ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీయాలని ఆలోచించే బదులు ఆర్టీసీ సమస్యపై పార్లమెంటులో చర్చ జరిగితే అనుసరించాల్సిన వ్యూహం గురించి కేటీఆర్‌ తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేస్తే మంచిదేమో? 


Related Post